మాడుగుల: ఒకప్పుడు ఎందుకూ పనికిరాని మెట్టు భూముల్లో మాత్రమే సరుగుడు సాగు చేసేవారు. మాగాణిలో వరి, చెరుకు పండించేవారు. రెండేళ్ల క్రితం వరకు మాడుగుల నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రధానంగా వరి, చెరుకు, అపరాలు సాగు చేసేవారు. వరి, చెరకు పంటల సాగు ఖర్చులు పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వం ప్రకటిస్తున్న అరకొర మద్దతు ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ పలువురు రైతులు సరుగుడు తోటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది చెరకు సాగు చేసిన రైతులే ఉన్నారు.
కనమరుగైన చెరుకు సాగు
జిల్లాలో గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలు మూతపడడంతో చెరుకు సాగు కనుమరుగైన పరిస్థితి ఏర్పడింది. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో సుమారు 26 వేల మంది రైతు కుటుంబాలకు జీవనాధారం పోయింది. పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధికి గండిపడింది. ఫ్యాక్టరీలు మూతపడక ముందు చెరకు సీజన్‌లో నవంబరు నుంచి మే నెల వరకు రైతులకు 15 రోజులకు పేమెంట్స్ అందేవి. రుణాలతో పాటు ఎరువులు, పురుగు మందులు రాయితీపై అందేవి. కూలి పనులు కూడా ఉండేవి. ఫ్యాక్టరీలు మూతపడిన తరువాత వరి సాగుపై దృష్టి సారించారు. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక ప్రతిఏటా నష్టం రావడంతో అప్పులే మిగులుతున్నాయని వరి రైతులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా సరుగుడు వైపు మొగ్గుచూపుతున్నారు. రానున్న కాలంలో ఇటు చెరుకు, అటు వరి పంటల కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతున్నారు.
ప్రత్యామ్నాయంగా...
చెరుకు, వరికి ప్రత్యామ్నాయంగా.. పెద్దగా పెట్టుబడి అవసరంలేని వాణిజ్య పంటగా గుర్తింపు పొందిన సరుగుడు సాగును రైతులు ఎంచుకుంటున్నారు. వరికి ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెడితే పంట పండితే రూ.30 వేలు ఆదాయం వస్తుంది. చెరకు రూ.30 వేలు పెట్టుబడిపెడితే రూ.60 వేల వరకూ ఆదాయం వస్తుంది. సరుగుడుకు ఎకరాకు రూ.20 వేల వరకూ పెట్టుబడి పెడితే నాలుగేళ్లకు ఒకసారి రూ.1.40 లక్షల ఆదాయం వస్తుంది. సరుగుడుకు మార్కెట్ ఉండడంతో ఇంతవరకూ చెరుకు, వరి పంటలు పండించే సారవంతమైన మాగాణి భూముల్లో కూడా సరుగుడు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పోవడంతో వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. భూములు బీడువారుతున్నాయి. అడపాదడపా కురుస్తున్న జల్లులకు సరుగుడు మొక్కలు ఏపుగా పెరిగాయి. సరుగుడు ఎకరాకు నాలుగేళ్లకు ఒకసారి సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడులు అవసరం లేదు. మొక్క నాటితే చాలు పెట్టుబడి అడగదు.
పంట వేసి...పనులకు పోతున్నారు
చెరుకు సాగు ఉండేటప్పుడు ఆరు నెలల పాటు చెరుకు, వరి పనులు ఉండడం వల్ల సన్న చిన్న కారు రైతులకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం చెరుకు, వరి పనులు లేకపోవడంతో సరుగుడు మొక్కలు వేసుకుని, పశ్చిమ, గోదావరి, తూర్పుగోదావరి,జిల్లాలకు కూలీలుగా వలస పోతున్నారు. సరుగుడు సాగులో ఒక్కసారి మొక్కలు నాటితే నాలుగేళ్ల వరకు పెట్టుబడి ఉండదు, తెగుళ్లు సోకవు, సాగు నీరు అంతగా అవసరం లేదు. జంతువులు వల్ల నష్టం లేదు. ఆదాయం బాగుండడంతో రైతులు సరుగుడుపై దృష్టి సారిస్తున్నారు.
సరుగుడు నారుకు డిమాండ్
రైతులందరూ సరుగుడు సాగుపై దృష్టి సారించడంతో నారుకు డిమాండ్ పెరిగింది. ఒక్కో మొక్క రూ. రెండు నుంచి రూ.నాలుగు వరకు ధర పలుకుతోంది.ఎకరాకు 4–5 వేల మొక్కలు వేస్తున్నారు. ఐదేళ్ల తరువాత 60 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని, అప్పటి ధరనుబట్టి ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో ఏటా పెరుగుతున్న విస్తీర్ణం
వరి, చెరకుకు ప్రత్యామ్నాయంగాసరుగుడు సాగుపై దృష్టి
గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీల మూతతో కనుమరుగైనచెరుకు సాగు


