● రైతుల కడగండ్లు పట్టని కూటమి సర్కార్ : కరణం ధర్మశ్రీ
● అన్నదాతలు, నాయకులతో శారదానది గండ్లు, గట్ల పరిశీలన
యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వానికి రైతు ల సమస్యలు పట్టడం లేదని, అన్ని వర్గాల ప్రజల ను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలకు కూడా కడగండ్లే మిగుల్చుతోందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. రాంబిల్లి మండలంలో శారదానదికి గత ఏడాది పడిన గండ్లు, బలహీనపడిన గట్లను ఆయన రైతులు,పార్టీ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. కొత్తూరు, రజాల,కుమ్మరాపల్లి, మురకాడ,మర్రిపాలెం,రాజారాయుడుపాలెంలలో నది పరిశీలన యాత్ర నిర్వహించారు. అనంతరం రాజారాయుడుపాలెం వంతెన వద్ద నిర్వహించిన సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడుతూ గత ఏడాది భారీ వర్షాలతో శారదానదికి పడిన గండ్లను 90 రోజుల్లో పూడ్చివేస్తామని కలెక్టర్ చెబితే, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కేవలం 30 రోజుల్లో పూడ్చుతామని,బలహీనపడిన గట్లను పటిష్టపరుస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికి 9 నెలలవుతున్నా పనులు కార్యరూపం దాల్చలేదని, మళ్లీ వర్షాకాలం వచ్చేసిందన్నారు. అధికారుల దృష్టికి ఈ సమస్యను పలుమార్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శారదానది గండ్ల పూడ్చివేతపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. రైతుల సమస్యలను పట్టించుకునే తీరిక స్థానిక ఎమ్మెల్యేకుగాని,కూటమిలో ఇతర పార్టీల నాయకులకు గానీ లేకపోవడం దురదృష్టకరమని ధర్మశ్రీ ఆరోపించారు.
తక్షణ చర్యలకు డిమాండ్
కొత్తూరు వద్ద మేజర్ శారదా నదికి పడిన భారీ గండి చాలా ప్రమాదకరంగా ఉందని దానితో పాటు మైనర్ శారదానది గండ్లు,బలహీనపడిన గట్ల పటిష్టానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెబుతున్నా కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రయోజనం ఉండడం లేదన్నారు.రాంబిల్లి మండల రైతులతో పాటు శారదానది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత దృష్ట్యా గండ్లు పూడ్చాలని కోరారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు స్పందించకపోతే త్వరలో రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాంబిల్లి మండల అధ్యక్షుడు పిన్నమరాజు కిషోర్‌రాజు,రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు,రాంబిల్లి ఎంపీపీ గొట్టుముక్కల శ్రీనుబాబు,కొవిరి రామకృష్ణ,నీరుకొండ వెంకటసూరి మాస్టారు(గోకివాడ),పలు గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


