● దర్జాగా ట్రాక్టర్లలో తరలింపు
● పట్టించుకోని అధికారులు
● ఆందోళనలో గంగపుత్రులు
నక్కపల్లి: సముద్రపు ఇసుక కూటమి నేతలకు కాసు ల పంట పండిస్తోంది. తీరప్రాంతాల్లో ఇసుకను కొంతమంది రాత్రింబవళ్లు యథేచ్ఛగా తవ్వి భారీ ఎత్తున తరలించుకుపోతున్నారు. రాజయ్యపేట, బోయపాడు, మూలపర్ర తదితర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ అధికంగా సాగుతోంది. నిత్యం వంద లాది ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. దర్జాగా తరలించేస్తున్నా మైనింగ్, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సముద్రపు ఇసుకను నదుల్లో లభించే ఇసుకతో కల్తీ చేసి స్థానికంగా భవన నిర్మాణదారులకు, బల్క్ డ్రగ్ పార్క్, స్థానికంగా ఉండే కంపెనీలకు అమ్మేస్తున్నారు. ఒక ట్రాక్టర్ నది ఇసుకలో రెండు ట్రాక్టర్ల సముద్రపు ఇసుకను కల్తీ చేసి ట్రాక్టర్ రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు తదితర తీరప్రాంతాల నుంచి రోజుకు 100 నుంచి 150 ట్రాక్టర్లకు పైనే ఇసుక తరలిపోతోందని భోగట్టా. ఎవరైనా రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే కూటమి పెద్దలు రంగంలోకి దిగి ట్రాక్టర్లపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘన
సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం తీరానికి 500 మీటర్ల వరకు ఎటువంటి తవ్వకాలు, నిర్మాణాలు చేయకూడదు. కొంతమంది కూటమి చోటామోటా నాయకులు మాఫియాగా ఏర్పడి ఆ నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో తీరప్రాంతాలకు ఆనుకుని ఉన్న తమ గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందని మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. సునామీ, తుపానులు సంభవించినప్పుడు ఈ ఇసుక తిన్నెలే తమకు రక్షణగా నిలుస్తాయని, ఇప్పుడు ఇసుక దిబ్బలను తోడేస్తుండడంతో భద్రత లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సముద్రపు ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.


