ఆరిలోవ: రాష్ట్ర స్థాయిలో టెన్నికాయిట్ పోటీలకు విశాఖ జిల్లా నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా జట్టు ఎంపిక కోసం గురువారం శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విశాఖపట్నం టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లాలోని పలు జెడ్పీ, గురుకులాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11, 12వ తేదీల్లో ప్రకాశం జిల్లా జాగురుమల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా తరఫున పాల్గొంటారు. ఇదిలా ఉంటే జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలను ముందస్తు ప్రచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం టెన్నికాయిట్ అసోసియేషన్ కనీస సమాచారం లేకుండా ఈ ప్రక్రియ ముగించేయడంతో.. జిల్లాలోని ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం దక్కకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, పలు పాఠశాలల పీడీలు డి.వి.సాగర్, జె.వివేక్, కె.నారాయణమ్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


