98.49 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి, డిజిటలైజేషన్ 37.21 శాతం అంటున్న అధికారులు
క్షేత్రస్థాయిలో మాత్రం ‘మా ఇంటికి బీఎల్‌వో రాలేదు’ అంటున్న ఓటర్లు
అస్తవ్యస్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ
మా గడపకు రాలేదు
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) అస్తవ్యస్తంగా సాగుతోంది. ఓవైపు ఎన్య్యుమరేషన్ ఫారాల అందక ఓటర్లు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరిగిపోయిందని కమిషన్‌కు నివేదించారు. యంత్రాంగం అధికారిక లెక్కలు ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాల్సి ఉండగా చాలా గ్రామాల్లో ఓటర్లనే సచివాలయాలకు పిలిపించి, ఫారాలు నింపిస్తున్నారు.
సాక్షి, అనకాపల్లి : ‘జిల్లాలో 98.49 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది.. ఇప్పటికే 37.21 శాతం ఫారాలు డిజిటలైజ్ చేశాం.’ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉన్నతాధికారి సమర్పించిన లెక్కలివి.కానీ..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 50 శాతానికి పైగా బూత్‌ల పరిధిలో ఓటర్లు మా ఇంటికి ఎవరూ రాలేదు సర్ అని చెబుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది.‘సాక్షి’ పరిశీలించిన పలు ప్రాంతాల్లో ఒకే తరహా ఫిర్యాదులు వినిపించాయి.
బీఎల్‌వోలతో పెన్షన్ల పంపిణీ
‘సర్’ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సిన బీఎల్‌వోలతో నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో పెన్షన్ పంపిణీ చేయించారని సమాచారం. ఈ నెల ఒకటి తేదీ నుంచి మూడు రోజుల పాటు వారు ఇదే పనిలో ఉండడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సక్రమంగా జరగలేదు.
అధికారిక లెక్కల ‘మ్యాజిక్’
‘సర్’లో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్‌ఫారాల ఇవ్వాలన్నది నిబంధన. జిల్లాలో 13,02,389 మంది ఓటర్లు ఉంటే, అందులో ఏకంగా 12,82,714 మందికి ఫారాలు పంపిణీ చేసేశామని చెబుతున్నారు. కె.కోటపాడు, రోలుగుంట మండలాల్లో 100 శాతం, దేవరాపల్లి 99.99 శాతం,ఎస్.రాయవరం మండలంలో 99.95 శాతం పూర్తయిపోయిందని పేర్కొంటున్నారు. కానీ, ఆ మండలాల్లో మాత్రం 40 శాతానికి పైగా ప్రజలు ‘మా ఇంటికి ఏ అధికారీ రాలేదు.., మాకే ఫారాలు అందించలేదు’ అని చెబుతున్నారు
డిజిటలైజేషన్ విడ్డూరాలు
క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీపైనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. ఈ డిజిటలైజేషన్ ఏ ఆధారంగా జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సరిచూశారా? లేక పాత నమోదుల ఆధారంగానే ప్రక్రియ పూర్తవుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రశ్నలెన్నో.. సమాధానాలు కావాలి
ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేయాల్సిన ప్రక్రియలో ఎందుకు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి?. 98.49 శాతం పంపిణీ పూర్తయిందంటే.. ఇంకా ఫారాలు అందలేదని చెబుతున్న కుటుంబాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హడావుడి వెనుక ‘రాజకీయ కుట్ర’?
ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే పంపిణీ పూర్తయిందని చెప్పడం ద్వారా, తమకు అనుకూలం కాని ఓట్లను సైలెంట్‌గా జాబితా నుంచి తొలగించేందుకు అధికార టీడీపీ కుట్ర పన్నుతోందన్న విమర్శలొస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ కాస్తా.. పక్కా ప్రణాళికతో జరుగుతున్న ‘ఓట్ల తొలగింపు‘ కార్యక్రమంగా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


