మందకొడిగా.. | - | Sakshi
Sakshi News home page

మందకొడిగా..

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

ఎన్యుమరేషన్‌ ఫారం ఇంకా ఇవ్వలేదు

దేవరాపల్లి పంచాయతీలోని బూత్‌ నంబర్‌ 130లో నాకు ఓటు ఉంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కా ర్యక్రమంలో భాగంగా నాకు ఇప్పటి వరకు ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినా అధికార్లు పట్టించుకోవడం లేదు. నాలాగే చాలా మందికి ఇంకా ఫారాలు ఇవ్వలేదు. అధికార్లు స్పందించి అందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.

–కొట్టాన వెంకట రమణ,

ఓటరు దేవరాపల్లి

కశింకోట/మునగపాక/దేవరాపల్లి/అనకాపల్లి టౌన్‌: జిల్లాలో ‘సర్‌’ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికి కేవలం 37 శాతం మేర మాత్రమే కార్యక్రమం పూర్తి అయింది. మిగిలిన 11 రోజుల గడువు ఉన్నా 63 శాతం మేర పూర్తి కావలసి ఉంది. దీంతో ఇది గడువులోగా పూర్తి అయ్యేనా? అర్హులందరికీ ఓట్లు లభించేనా? అని ఆందోళన వ్యక్తం అవుతోంది. కశింకోట మండలంలో సుమారు 57 వేల మంది ఓటర్లుండగా, 71 పోలింగ్‌ బూత్‌లున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించి, వివరాలను సేకరించి, నమోదు చేసి వారికి రసీదు ఫారం ఇవ్వాల్సి ఉంది. 2002 ఓటర్ల జాబితాతో ఓటర్ల వివరాలు బేరీజు వేయాల్సి ఉంది. ఇందుకు సచివాలయ, పంచాయతీ సిబ్బంది, బీఎల్‌ఎలను నియమించారు. వారు ఇళ్లకు వెళ్లి ఓటర్ల తనిఖీ నిర్వహిస్తున్నారు.ఇందుకు ఎక్కువ సమయం తీసుకుంటుండటం, సరైన వివరాలు లేక ఓటర్ల ఇళ్లు కనుక్కోవడం కష్టంగా మారింది. కొందరు వలసలు వెళ్లిపోవడంతో తనిఖీలో జాప్యం జరుగుతోంది. కొన్ని గ్రామాలు, కొన్ని బూత్‌లకు సంబంధించి కుటుంబాల్లో ఇద్దరు ఒక బూత్‌లోనూ, మరొకరు వేరొక బూత్‌లో ఉండడంతో ఓటర్లను గుర్తించేందుకు అవస్థలు తప్పడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్‌ బూత్‌ల్లో ఉండడంతో ఎన్యుమరేషన్‌ చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు, సిబ్బంది అంటున్నారు. అయితే తమ వద్దకు అధికారులు ఇంకా రాలేదని, తమ ఓటు ఉంటుందా?ఊడుతుందా? అని ఓటర్లు మదన పడుతున్నారు.

●మేజర్‌ పంచాయతీ మునగపాకలో పలువురు బీఎల్‌వోలు సచివాలయానికి ఓటర్లను రప్పించి అక్కడే ఫారాలు నింపడంతో పాటు ఆన్‌లైన్‌ చేయడంతో గంటల కొద్దీ ఓటర్లు వేచి ఉండాల్సి వస్తోంది. బీఎల్‌ఏల సహకారం కూడా ఆశించిన మేర లేకపోవడంతో ఎన్యుమరేషన్‌ చేసేందుకు ఇబ్బందికరంగా ఉందంటూ పలువురు బీఎల్‌వోలు వాపోతున్నారు. మునగపాక మండల వ్యాప్తంగా 45,210మంది ఓటర్లు ఉన్నారు. 57 మంది బీఎల్‌వోలు ఉన్నారు. ఇంతవరకు 38శాతం మేర ఎన్యూమరేషన్‌ జరిగినట్లు డీటీ మురళీధర్‌ తెలిపారు.

●దేవరాపల్లి మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ, డిజిటైజేషన్‌ లోపాభూయిష్టంగా ఉంది. ప్రధానంగా మండల కేంద్రం దేవరాపల్లిలో పలువురికి ఇప్పటి వరకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిన ఫారాలను ప్రజల వద్దకు వెళ్లి బీఎల్‌వోలు సేకరించాల్సి ఉండగా ప్రజలను ఆఫీసులకు రప్పించుకుంటున్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో

● అనకాపల్లి నియోజకర్గంలోసర్‌ నత్త నడకన సాగుతోంది. అనకాపల్లి పట్టణంలో 32.52 శాతం, అనకాపల్లి మండలంలో 33.91, కశింకోటలో సుమారు 38 శాతం మాత్రమే డిజిటలైజేషన్‌ జరిగినట్టు అధికారులు తెలిపారు. అధికారులు ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలు ఇచ్చినా, ఓటర్లు వారి వివరాలు నింపి బీఎల్‌వోలకు అందజేయడంలేదు. ఎన్నికల కమిషన్‌ పదే పదే హెచ్చరిస్తున్నా చాలా మంది ఎన్యుమరేషన్‌ ప్రక్రియపై సరైన స్పష్టత లేక నిర్లక్ష్య వహిస్తున్నారు. దీంతో ఓటు కోల్పోయే ప్రమాదముంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement