ఆవాసం మారితే అవస్థలే! | - | Sakshi
Sakshi News home page

ఆవాసం మారితే అవస్థలే!

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

2002 ఓటరు జాబితా మ్యాపింగ్‌లో అర్హులైన ఓటర్లకు కొత్త చిక్కులు

చిరునామా, తండ్రి పేరులో తేడాతో కనిపించని ఓట్లు

ఇంటింటికీ రాని బీఎల్‌వోలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

2024 ఎన్నికల్లో ఓటు వేశారు.. ఇప్పుడు అదే ఓటు జాబితాలో కనిపించడం లేదు. 2002లో ఓటే లేదు.. ఇప్పుడు పేరు ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు. చిరునామా మారితే ఒక సమస్య.. తండ్రి పేరులో చిన్న తేడా ఉంటే మరో సమస్య.. పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిన మహిళలకు ఇంకో సమస్య.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో 2002 ఓటర్ల జాబితాతో జరుగుతున్న మ్యాపింగ్‌ ప్రక్రియలో అనేక మంది ఓటర్లు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తండ్రి పేరులో తేడా.. మ్యాపింగ్‌కు బ్రేక్‌

రవికుమార్‌ గతంలో ఈస్ట్‌పాయింట్‌ కాలనీలో నివసించేవారు. అప్పట్లో అదే చిరునామాతో ఓటరు జాబితాలో పేరు నమోదైంది. ప్రస్తుతం ఎంవీపీ కాలనీలోని వైశాఖి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తూ, 2024 ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించారు. అయితే, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఆయన పేరు మ్యాపింగ్‌ కాలేదు. ఆరా తీస్తే 2002 ఓటరు జాబితాలో ఆయన తండ్రి పేరు ‘గుడిమెట్ల సత్తిరెడ్డి’కు బదులుగా ‘రెడ్డి జీఎస్‌’గా నమోదైనట్లు గుర్తించారు. ఈ పేర్ల వ్యత్యాసం కారణంగానే మ్యాపింగ్‌ నిలిచిపోయింది. చివరకు పాత ఓటరు జాబితాను పరిశీలించి, సంబంధిత వివరాలను సేకరించి బీఎల్‌వోకు సమర్పించిన తర్వాతే సమస్య పరిష్కారమైంది. తండ్రి పేరులో నమోదైన చిన్న పొరపాటు వల్ల తన ఓటే గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందని రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2002లో ఓటు లేకపోతే.. కొత్త తిప్పలు

కె.కృష్ణకాంత్‌కు 2002లో ఓటు హక్కు లేదు. ప్రస్తుతం అరిలోవలో నివసిస్తూ, 2024 ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించారు. అయితే సర్‌ ప్రక్రియలో ఆయన పేరు ఓటరు జాబితాలో కనిపించడం లేదు. 2002లో ఆయన తండ్రి సింహాచలం పేరుతో చీపురుపల్లిలో ఓటు నమోదై ఉండగా, ఇప్పుడు ఆ వివరాలు కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తన ఓటు హక్కు పునరుద్ధరణ కోసం ఏం చేయాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నానని కృష్ణకాంత్‌ వాపోతున్నారు.

పైళ్లెన మహిళలకు మరో సమస్య

2002 తర్వాత పెళ్లి చేసుకుని మరో ప్రాంతానికి వెళ్లిన మహిళల పేర్లు గుర్తించడం కూడా కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు. ఇంటి పేరు, చిరునామా మారడంతో మ్యాపింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇంటింటికీ పంపిణీ ఎక్కడ..?

జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా తమకు ఫారాలే అందలేదని పలువురు ఓటర్లు చెబుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఐదుగురు ఓటర్లు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి, మిగిలిన వారికి అందజేయలేదని వాపోతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేస్తున్నామని ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నా, అనేక ప్రాంతాల్లో మాత్రం సచివాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు ఓటర్లను పిలిపించి అక్కడికక్కడే ఫారాలు నింపించి తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారాలు స్వీకరించినట్లు బీఎల్‌వోలు రసీదులు ఇవ్వడం లేదని కూడా పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఫారాలు అందలేదని స్థానికులు చెబుతున్నారు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లకు ఫారాల పంపిణీ జరగలేదన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంటింటికీ ఫారాల పంపిణీ జరిగిందా? లేక కాగితాలకే పరిమితమైందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement