ఉక్కు ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

ఉక్కు ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

● మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించాలి ● అఖిల కార్మిక ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్‌

మహారాణిపేట(విశాఖ): స్టీల్‌ ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో జూన్‌ 8న జరిగిన ప్రమాదంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని జిల్లా కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేసి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో రాణికి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీజే అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన సభలో ప్రమాదంలో మృతి చెందిన 10 మంది కార్మికులకు నివాళులర్పిస్తూ నిమిషం పాటు మౌనం పాటించారు. జిల్లా జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, ఉక్కు పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, ఎన్‌.రామారావు, వైఎస్సార్‌టీయూ రీజనల్‌ అధ్యక్షుడు పి.వి.సురేష్‌, సీఎఫ్‌టీయూఐ జాతీయ అధ్యక్షుడు కనకారావు మాట్లాడుతూ ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం రూ.25 లక్షలు మాత్రమే ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున, అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు కూడా పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఐఎఫ్‌టీయూ, ఏపీ ఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్‌టీయూ, ఐఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement