మన్యం వీరుడి స్మారకాలు వెలవెల | - | Sakshi
Sakshi News home page

మన్యం వీరుడి స్మారకాలు వెలవెల

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

మన్యం వీరుడు అల్లూరి జయంతి, వర్ధంతి వేడుకలంటే కేవలం పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, ఫొటోలకు ఫోజులిచ్చే కార్యక్రమాలు మాత్రమేనా? మన్యం ప్రాంతంలో ఆయన పోరాట స్ఫూర్తిని సజీవంగా ఉంచాల్సిన స్మారక చిహ్నాలు నేడు నిధుల లేమితో, నిర్లక్ష్యంతో పర్యాటకుల ముందు వెక్కిరిస్తున్నాయి. శనివారం జయంతి సందర్భంగా అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం పార్కులదయనీయ స్థితిపై ప్రత్యేక కథనం.

హామీల కేరాఫ్‌ అడ్రస్‌గా అల్లూరి గుర్తులు! నేడు అల్లూరి జయంతి

కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. స్వాతంత్య్ర సంగ్రామంలో సింహస్వప్నం. కానీ, నేడు ఆ మహనీయుడి స్మారకాలు మాత్రం అనాదరణతో కుమిలిపోతున్నాయి. ఏడాదికి రెండుసార్లు జయంతి, వర్ధంతి పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించడం.. అంతే! ఆ తర్వాత మళ్లీ మౌనమే. ఆచరణకు నోచుకోని హామీల మధ్య అల్లూరి నడయాడిన మంప, రాజేంద్రపాలెం ప్రాంతాలు నేడు పర్యాటకుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి.

అందని నిధులు.. ఆగిపోయిన పనులు

అల్లూరి పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ ప్రాంతాలను పర్యాటక కారిడార్‌గా మారుస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గతంలో రాజ్యసభ సభ్యుడు సురేష్‌ ప్రభు నిధులతో రాజేంద్రపాలెంలో ప్రహరీ వంటి పనులు కొంతవరకు జరిగాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అల్లూరితో పాటు గంటం దొర, మల్లు దొర, బోనంగి పండు పడాల్‌ వంటి యోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మిగిలిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

మంపలో అస్తవ్యస్తం

అల్లూరి పట్టుబడిన మంప ప్రాంతంలో పార్కు ఆవరణను కొంతవరకు అభివృద్ధి చేసినా, అక్కడ నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అల్లూరి స్నానం చేసే కొలనును సుందరీకరించినప్పటికీ, ప్రస్తుతం అది పిచ్చి మొక్కలతో నిండిపోయి కనుమరుగవుతోంది. కొలను మధ్యలో ధ్యానముద్రలో ఉన్న అల్లూరి విగ్రహం మాత్రమే సందర్శకులను ఆకట్టుకుంటోంది. అయితే, స్మారక స్తూపాలపై కనీసం అల్లూరి జనన, మరణ వివరాలు కూడా లేకపోవడం గమనార్హం. పోరాట చరిత్రను కళ్లకు కట్టేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు ఖాళీగానే దర్శనమిస్తూ, చారిత్రక సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయనే భావనను కలిగిస్తున్నాయి.

మళ్లీ కొత్త ఆశలు..

మరి ఫలితం దక్కేనా?

ఈ ఏడాది మే 7న అల్లూరి వర్ధంతి సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్‌ మంప, రాజేంద్రపాలెం పార్కులను సందర్శించారు. ఒక్కో పార్కుకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. రెండు కోట్లు కావాలని కేంద్ర మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ కూడా నిధుల కోసం హామీ ఇచ్చారని మాధవ్‌ తెలిపారు. రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఈ తాజా హామీలైనా అమలుకు నోచుకుంటాయా? లేక పాత హామీల మాదిరిగానే కాలగర్భంలో కలిసిపోతాయా? అన్నది స్థానికుల ప్రశ్న. పర్యాటకులు వేల కిలోమీటర్లు దాటి వచ్చి ఇక్కడి దుస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారంటే, మనం చరిత్రను ఎంతలా విస్మరిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, మన్యం వీరుడి స్మృతి చిహ్నాలకు పూర్వవైభవం కల్పిస్తారని ఆశిద్దాం.

జీతం ఇస్తున్నారు

గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట పార్కుల్లో ఉన్న వాచ్‌మెన్‌లకు జీతాలు ఇస్తుంది. దీంతో పార్క్‌లను కొంత వరకు శుభ్రంగా ఉంచుతున్నారు.ఈ ఏడాది జనవరి నుంచి నెల నెల జీతాలు ఇస్తున్నారు.

– రాజుబాబు,

వాచ్‌మెన్‌, అల్లూరి పార్కు, మంప

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement