ఏయూ దూరవిద్యలో సర్టిఫికెట్లు సుదూరం! | - | Sakshi
Sakshi News home page

ఏయూ దూరవిద్యలో సర్టిఫికెట్లు సుదూరం!

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

● సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులకు అవస్థలు ● మార్కుల జాబితాలు, ఓడీల కోసం ప్రదక్షిణలు

విశాఖ విద్య: ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాల్సిన ఏయూ దూరవిద్యా కేంద్రం విద్యార్థుల పాలిట ఇబ్బందుల కేంద్రంగా మారుతోంది. మార్కుల జాబితాలు, ఒరిజినల్‌ డిగ్రీ(ఓడీ) సర్టిఫికెట్లు, కన్సాలిడేటెడ్‌ మార్క్స్‌ మెమోలు(సీఎంఎం), బదిలీ ధ్రువపత్రాలు(టీసీలు) సకాలంలో అందించట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాళ్లరిగేలా ప్రదక్షిణలు

దూరవిద్యా కేంద్రంలో యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు మార్కుల జాబితాలను సకాలంలో పోస్టు ద్వారా పంపించడం అధికారుల బాధ్యత. ఓడీలు, సీఎంఎంల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో పత్రాలు అందాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందకపోవడంతో దూరవిద్యా కేంద్రానికి పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్యాలయానికి వెళ్లినా రేపు రండి, వారం తర్వాత రండి.. అనే సమాధానాలే వినిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. టీసీల జారీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమన్వయ లోపమే శాపం?

దూరవిద్యా కేంద్రంలో ఏర్పడుతున్న సమస్యలకు సిబ్బంది మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు నిర్లిప్తత రాజ్యమేలుతోంది. పనితీరును పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పనులు పేరుకుపోతూ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నెలలు గడిచినా సర్టిఫికెట్లు అందని పరిస్థితి

గత ఏడాది మార్చి, నవంబర్‌లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలు ఇప్పటికీ అందలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల దరఖాస్తుల కోసం ఈ సర్టిఫికెట్లు కొందరికి అత్యవసరం. అయినప్పటికీ వాటి జారీపై దూరవిద్యా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం. సమన్వయ లోపం ఉండదు. పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.

– ఆచార్య డి.అప్పలనాయుడు,

డైరెక్టర్‌, ఏయూ దూరవిద్యా కేంద్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement