నర్సీపట్నం: నాతవరం పోలీసు స్టేషన్ పరిధి శృంగవరంలో ఓ పెళ్లి మండపం వద్ద నగదు బ్యాగ్‌ను చోరీ చేసిన వ్యక్తిని గంట వ్యవధిలో పోలీసులు అరెస్టు చేసి, రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు అందించిన వివరాలు..నగదు కాజేసిన వ్యక్తి విద్యావంతుడు. ఇతను డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై చోరీలకు పాల్పడుతున్నాడు. శృంగవరంలో ఈ నెల 2వ తేదీ రాత్రి పైల వారి వివాహ వేడుక జరిగింది. వధువు రమణమ్మ సోదరి రజని వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5లక్షల నగదు, పావుతులం బంగారు కాసు, ఒక సెల్‌ఫోన్, చీర బ్యాగ్‌లో పెట్టుకుని పెళ్లి మండపం వద్ద కూర్చుంది. తెల్లవారుజాము 3.40 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన పైల చిట్టిబాబు మండపంలోకి పరుగు పరుగున వచ్చి రజని వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు కేకలు వేసి వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె వెంటనే 112కి కాల్ చేసింది.
నాతవరం స్టేషన్ బీట్ సిబ్బంది కానిస్టేబుల్ మహేష్, హోంగార్డు సంజీవ్ అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్‌ఐ తారకేశ్వరరావు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ సిగ్నిల్ సాయంతో గ్రామ శివారులో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడ్డి వాములో దాచిన నగదు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.


