అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్‌ఐలకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె.ఖాదర్ బాషాను వన్‌టౌన్ లా అండ్ ఆర్డర్ నుంచి ఎంవీపీ లా అండ్ ఆర్డర్‌కు, ఎం.శిరీష్‌కుమార్‌ను కంచరపాలెం క్రైమ్ నుంచి వన్‌టౌన్ లా అండ్ ఆర్డర్‌కు, జి.వెంకటరావును పద్మనాభం క్రైమ్ నుంచి అరిలోవ క్రైమ్‌కు, ఎస్.శ్రీకాంత్‌ను సీఎస్‌బీ నుంచి పీసీఆర్, ఎయిర్‌పోర్టు ట్రాఫిక్‌కు అటాచ్‌మెంట్‌పై, కొమర శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ నుంచి సీఎస్‌బీకి బదిలీ చేశారు. పదోన్నతిపై విశాఖ రేంజ్ నుంచి సిటీ కమిషనరేట్‌కు వచ్చిన టి.కె.మూర్తికి పోలీస్ కంట్రోల్ రూమ్, పి.జనార్దనరావుకు సిటీ వీఆర్ (ఐటీ సెజ్–మధురవాడ అటాచ్‌మెంట్), టి.శ్రీనివాసరావుకు పద్మనాభం క్రైమ్, ఎన్.ధనుంజయ ఆచార్యులకు సీసీఎస్, ఎ.రహమాన్‌కు సీసీఎస్ (సీటీఆర్‌బీ అటాచ్‌మెంట్)లో పోస్టింగ్‌లు ఇచ్చారు. అలాగే, ప్రస్తుతం త్రీటౌన్ క్రైమ్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌గా పనిచేస్తున్న ఎం.రాజారావును ఆయన అభ్యర్థన మేరకు మహిళా పోలీస్ స్టేషన్‌కు రెగ్యులర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావుకు బదిలీ
మహారాణిపేట: మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావుకు బదిలీ అయింది. నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.బి.ఎస్.వర్దన్‌ను విశాఖ జిల్లా మత్స్యశాఖ జేడీ(ఇన్‌చార్జి)గా నియమించారు. శనివారం వర్దన్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
నేడు పాండ్రంగిలో అల్లూరి జయంతి
మహారాణిపేట : పద్మనాభం మండలం పాండ్రంగిలో శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని కలెక్టరు ఎం.అభిషిక్త్ కిషోర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ఆ గ్రామంలో అల్లూరి సీతారామరాజు ఇంటి నుంచి భరతమాత గుడి వరకు విద్యార్థులు, కళాకారులతో ర్యాలీ, అనంతరం బహుమతుల ప్రదానం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


