ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. నలుగురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ.. నలుగురు అరెస్టు

Jul 4 2026 2:19 AM | Updated on Jul 4 2026 2:19 AM

తాటిచెట్లపాలెం(విశాఖ): భువనేశ్వర్‌–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్ర యాణికులను లక్ష్యంగా చేసు కుని దోపిడీలకు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), విశాఖపట్నం డివిజన్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోని వివిధ బోగీల్లో నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), విశాఖపట్నం సిటీ పోలీసులు, విజయవాడ డివిజన్‌ ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో కొద్ది గంటల్లోనే గోకుల్‌ థియేటర్‌ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.43,800 నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తుని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

హత్యాయత్నం కేసులో రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలు

గాజువాక : గాజువాకలో 2017లో జరిగిన ఒక హత్యాయత్నం కేసులో ఇద్దరు రౌడీషీటర్లకు నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మెహర్‌నగర్‌కు చెందిన పీతల బాల భవాని భర్త అదే ప్రాంతానికి చెందిన పి.మహలక్ష్మినాయుడుకు రూ.5వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు మొత్తం తిరిగి ఇవ్వాలని అడిగిన భవాని భర్తతో నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు. దీంతో 2017 జనవరి 2వ తేదీ రాత్రి నిందితులు పి.మహలక్ష్మినాయుడు, పి.గౌరీసాయి అలియాస్‌ గుర్రాల సాయి బాధితుడి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. స్టీల్‌ ఫోర్క్‌తో బాధితుడి కంఠ భాగంలో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాల భవాని గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితులకు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement