లయ తప్పినసచివాలయాలు | - | Sakshi
Sakshi News home page

లయ తప్పినసచివాలయాలు

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

మెలిపాకలోని రైతు భరోసా కేంద్రం(ఫైల్‌)

మునగపాక: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ పాలనకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. 2019 నుంచి 2024 వరకు ప్రజలకు ప్రజా రంజక పాలన అందింది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా పలు సంక్షేమ పధకాలతో పాటు పలు సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిది. కాగా జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన పలు పధకాలకు పేర్లు మార్చడంతో పాటు.. సంక్షేమ పథకాలు ఎపుడు అందుతాయో తెలియక అయోమయానికి గురవుతున్న సందర్భాలు నేటి కూటమి హయాంలో ప్రజలకు ఎదురవుతున్న అనుభవం. ప్రజలకు చేరువగా పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో సచివాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిస్తే...ఆ రెండింటినీ నిర్వీర్యం చేసి, నాటి సంక్షేమ పథకాలకు పాతర వేస్తున్న ఘనత నేటి కూటమి పాలకులకు దక్కుతుంది.

నాడు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా...

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందుకోసం లక్షలాది మందిని ఉద్యోగులను నియమించింది. వార్డు సచివాలయాల్లో 12 మంది అలాగే గ్రామ సచివాలయాల్లో 11 మంది చొప్పున సిబ్బందిని నియమించారు. ప్రజలకు అవసరమయ్యే పలు సేవలను స్థానికంగా ఉండే సచివాలయాల్లో సకాలంలో అందేవి.మరో అడుగు ముందుకేసి ప్రజలు సచివాలయాలకు కూడా రాకుండా ఉండేలా వలంటీర్ల సహకారంతో గత ప్రభుత్వం ఇంటి ముంగిటకే సేవలందించింది. సచివాలయాలు అటు సిబ్బందితోనూ అలాగే ప్రజలతోనూ కళకళలాడేవి, సౌలభ్యమైన పౌరసేవలతో అయిదేళ్ల పాటు ఒక స్వర్ణయుగంగా పాలన సాగిందనే చెప్పాలి. ఒక్కో సచివాలయ భవన నిర్మాణానికి రూ.45 నుంచి రూ.48 లక్షల వరకు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు.

ఉద్యోగుల కుదింపుతో అందని సేవలు

రైతులు తమకు కావాల్సిన అడంగల్‌,1 బీ రికార్జులు అలాగే విద్యార్దులు తమకు కావాల్సిన పలు రకాల సర్టిఫికెట్ల కోసం సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే సిబ్బంది పూర్తిస్థాయిలో లేక ప్రజలు తమకు అవసరమయ్యే సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సచివాలయాలకు పేర్లు మార్చడం కూడా విమర్శలకు తావిస్తుంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో సేవలు పొందేందుకు వీలుగా పలువురు ఉద్యోగులు అండుబాటులో ఉండేవారని నేడు కూటమి హయాంలో ఉద్యోగుల కుదింపుతో కష్టాలు తప్పడం లేదంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉన్న కాస్తో కూస్తో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ జనం వాపోతున్నారు.

రైతులకు భరోసాగా నాడు ఆర్‌బీకేలు

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాత కోసం రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమయ్యే సేవలను అందించేందుకు విలేజ్‌ అగ్రికల్చర్‌ అధికారులను నియమించారు. అలాగే రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు రైతు భరోసా కేంద్రాల్లో గ్రంథాలయాల నిర్వహణతో పాటు పలు పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. సీజన్‌లో రైతులకు అవసరమయ్యే ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉండేవి. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలో 486 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో కేంద్రానికి రూ.22 లక్షల వంతున నిధులు కేటాయింపులు జరిపి భవనాలను నిర్మించారు. కూటమి అఽధికారంలోకి వచ్చాక హేతుబద్దీకరణలో భాగంగా 294 సేవాకేంద్రాలకు పరిమితం చేశారు.

నిర్లక్ష్యం బారిన రైతు సేవా కేంద్రాలు

జననేత పథకాలకు కూటమి తూట్లు

గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు పాలనలో బీటలు

ప్రభుత్వ తీరుపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

పేరు మార్చి..సేవలు తగ్గించి...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల పేరును మార్చి వేశారు. రైతు సేవా కేంద్రాలుగా మార్పులు చేశారు.గతంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంటే నేడు రేషనలైజేషన్‌ పేరిట రెండు,మూడు గ్రామాలకు ఈ రైతు సేవా కేంద్రాలను తగ్గించి వేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగా ఉండే రైతులు సేవలు పొందేవారు. నేడు కూటమి పాలనలో రైతు సేవా కేంద్రాలు వచ్చాక ఇబ్బందులు పడుతున్నారు. రెండు,మూడు గ్రామాలకు రైతు సేవా కేంద్రం ద్వారా విత్తనాలు,ఎరువులు అందిస్తున్నారు. దీంతో రైతులు అవస్థలు పదుతున్నారు. గంటల కొద్దీ ఎరువులు,విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిని ఎదుర్కుంటున్నారు. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన పథకానికి పేర్లు మార్చి కొత్తగా రైతు సేవా కేంద్రంగా నామకరణాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదంటూ రైతులు వాపోతున్నారు.

వలంటీర్లపై కక్ష కట్టి..

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 1188 వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. వాటిలో వార్డు పరిధిలో 435 సచివాలయాలు కాగా గ్రామ పరిధిలో 753 సచివాలయాలు అందుబాటులో ఉండేవి.దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిబ్బంది సంఖ్యను కుదించేలా చర్యలు చేపట్టింది. సచివాలయాలకు ప్రాధాన్యం తగ్గించేలా తొలుత వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసింది. తరువాత క్రమేణా పలువురు ఉద్యోగులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు కేటాయింపులు చేయడంతో నేడు సచివాలయాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.సచివాలయాల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.ఏ పని కావాలన్నా పదేపదే సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులను ప్రజలు ఎదుర్కుంటున్నారు. కొంతమంది సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు సచివాలయ బాధ్యతలను అప్పగించడంతో ఏ అధికారి ఎపుడు అందుబాటులో ఉంటారో తెలియక అవస్థలు పడాల్సి వస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement