నక్కపల్లి: ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇక నుంచి ప్రైవేటు పరం కానున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను ఇకనుంచి పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్) విధానంలో నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 396 నుంచి విడుదల చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధానాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ఆలోచన చేస్తే అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు, వివిధ వర్గాల వారు దస్తావేజు లేఖర్లు సంఘం వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయాలంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భూముల వివిధ రకాల ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలైన రిజిస్ట్రేషన్‌లు, స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు, దస్తావేజుల తయారీ, రికార్డుల నిర్వాహణ తదితర సేవలను ఇక నుంచి పీపీపీ విధానంలో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ను శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు..
పాస్‌పోర్టు సేవాకేంద్రాల మాదిరిగా పౌరులు నిర్ణీత సమయంలో నమోదు పత్రాలు పొందడం, సమగ్ర సౌకర్య సేవలను పొందడం కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్‌ఎస్‌కే (రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (ఆర్‌ఎస్‌కేలు)గా పరిగణించాలని నిర్ణయించారు. సింగిల్ విండో కేంద్రాలుగా పరిగణిస్తున్న ఈ కార్యాలయాల్లో ఏనీవేర్ రిజిస్ట్రేషన్, ఆడ్వాన్స్ స్లాబ్ బుకింగ్ ఇంటి గ్రేటెడ్ పేమెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. దస్తావేజుల తయారీ ప్రైవేటు సంస్థలే చేపడతాయి. రిజిస్ట్రేషన్ ఆమోదానికి ముందు జరిగే ప్రక్రియ అంతా కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేటు సంస్థలే చేపడతాయి. రిజిస్ట్రేషన్ ఆమోదం మాత్రం సబ్ రిజిస్ట్రార్‌లే చూడాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి చట్టబద్ధమైన నియంత్రణ అంతా ప్రభుత్వం వద్దే పటిష్టంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటోంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజులకు రూ.2వేలు రుసుము చెల్లించాలని జీవోలో పేర్కొన్నారు.
లేఖర్ల ఉపాధికి దెబ్బ..
పోలవరం, అల్లూరి జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనే పీపీపీ విధానంలో ఆర్‌ఎస్‌కేలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దస్తావేజుల తయారీ, ఆడ్వాన్స్ స్లాట్ బుకింక్, స్టాంప్ డ్యూటీ వసూలు, డేటా అంతా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ అంతా దస్తావేజు లేఖర్లు చేసేవారు. ఇక నుంచి దస్తావేజు లేఖర్లకు బదులు పీపీపీ విధానంలో ఎంపికై న సంస్థలు ఈ ప్రక్రియను చేపడతాయి. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్లతో పాటు, వారికి సహాయకులుగా ఉండేవారు ఉపాధి కోల్పోతారంటూ లేఖర్లు ఆందోళన చేపట్టారు.


