మహారాణిపేట: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ఇకపై ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్(వీబీజీ రామ్‌జీ)’పేరుతో అమలుకానుంది. జూలై నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుపతిలో గురువారం అధికారికంగా ప్రారంభించారు. పేరు మార్పుతో సహా, నూతన చట్టంలోని నిబంధనలపై కార్మిక వర్గాల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
20 ఏళ్ల తర్వాత పేరు మార్పు
గ్రామీణ పేదలకు స్వగ్రామంలోనే ఉపాధి కల్పించి వలసలను నిరోధించాలనే లక్ష్యంతో 2006లో ప్రారంభమైన ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏడాదికి 100 రోజులుగా ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచింది. రోజువారీ కూలీని రూ.311గా కొనసాగిస్తూ, గ్రామపంచాయతీల్లో కూలీల అవసరాల ఆధారంగా బడ్జెట్ కేటాయించనుంది. నిర్ణీత సమయంలో పని కల్పించకపోతే 15 రోజుల్లో నిరుద్యోగ భృతి చెల్లించే నిబంధన తీసుకొచ్చింది.
సాంకేతిక పర్యవేక్షణకు ప్రాధాన్యం
పథకంలో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎంఎంఎస్) యాప్, ఫేషియల్ అటెండెన్స్, బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్ వంటి సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టారు. పని ప్రారంభం, ముగింపు సమయంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేశారు. దీంతో దొంగ మస్తర్లకు అడ్డుకట్ట పడనుండగా, సర్వర్ సమస్యలు, మొబైల్ సిగ్నల్ లేకపోవడం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో..
అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల పరిధిలో 645 గ్రామపంచాయతీల్లో 2,71,728 మంది జాబ్‌కార్డుదారులు ఉన్నారు. వీరిలో 2,43,472 మందికి ఉపాధి కల్పించారు. విశాఖ జిల్లాలోని నాలుగు మండలాల్లో 79 గ్రామపంచాయతీల పరిధిలో 56,324 మంది జాబ్‌కార్డుదారులు ఉండగా, 32,029 మందికి ఉపాధి లభించింది. రెండు జిల్లాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రహరీ గోడలు, కేటిల్ షెడ్లు, జలధార, జలహారతి, పల్లె పండుగ, పండ్ల తోటల అభివృద్ధి, నీటి సంరక్షణ, పశువుల తొట్టెల నిర్మాణం తదితర పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేపట్టిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–నిర్మలదేవి, డ్వామా పీడీ, విశాఖ, అనకాపల్లి జిల్లాలు


