వీబీజీరామ్‌జీ పథకం పల్లె సీమల ప్రగతికి వరం | - | Sakshi
Sakshi News home page

వీబీజీరామ్‌జీ పథకం పల్లె సీమల ప్రగతికి వరం

Jul 3 2026 12:40 AM | Updated on Jul 3 2026 12:40 AM

గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్‌

తుమ్మపాల: వికసిత భారత్‌ – 2047 కలను సాకారం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో గురువారం వికసిత భారత్‌–గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ గ్రామీణ్‌ అమలు కార్యక్రమాన్ని ఆమె భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికసిత భారత్‌ –2047 కలను సాకారం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలుపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) పథకం పల్లెసీమలు ప్రగతికి గొప్పవరం అని, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు. వికసిత్‌ భారత్‌ – గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ) అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి, సంక్షేమ కార్యక్రమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్ట బద్ధమైన హామీని ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబానికి 125 రోజులు పాటు ఉపాధి కల్పిస్తారని, వ్యవసాయ పనుల సమయంలో ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రకటన ద్వారా 60 రోజులు పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ అందుబాటులో ఉంటుందన్నారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, సోలార్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఈ కార్యక్రమంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలు, కర పత్రాలు ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ నిర్మలా దేవి, అదనపు పీడీ మణికుమార్‌, ప్రత్యేక అధికారి శ్రీ రామమూర్తి, మహిళా రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement