ఆనందపురం: ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీవోపీ) కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు హరీత్ సింగ్, సృష్టి గుప్తా గురువారం విశాఖ జిల్లాలో పర్యటించారు. జిల్లాకు గుర్తించిన ‘సీ ఫుడ్ క్లస్టర్’ పరిశీలనలో భాగంగా మండలంలోని వెల్లంకి గ్రామంలోని ఓ ప్రైవేట్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించి, రొయ్యలు, చేపల ప్రాసెసింగ్, ఎగుమతి విధానాలను పరిశీలించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారిణి వి. పద్మ, అభివృద్ధి అధికారులు బి. లీలాకుమార్, కె. ముఖర్జీ క్లస్టర్ పనితీరును కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన బృందం సముద్ర ఆహార ఉత్పత్తుల లభ్యతపై ఆరా తీసింది. రామానాయుడు స్టూడియో సమీపంలోని ప్రతిపాదిత ‘యూనిటీ మాల్’ స్థలాన్ని కూడా పరిశీలించింది. పర్యటన ముగింపులో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది.


