విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల అనుభవాన్ని ప్రస్తుత విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో ’ఏయూ–సేతు’ పేరుతో అలుమ్ని మెంటార్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్య, పరిశ్రమ, పరిశోధన, పారిశ్రామికవేత్తలు, ప్రజాసేవ తదితర రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను ప్రస్తుతం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులతో అనుసంధానించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విడుదల చేశారు. డీన్ ఆచార్య పి.శ్యామల మాట్లాడుతూ ఏయూ–సేతు తరతరాల విద్యార్థులను అనుసంధానించే వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించినట్టు తెలిపారు.


