ఎస్.రాయవరం: గోకులపాడు జంక్షన్‌లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయిన కారు అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిన ఘటనలో అయిదుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి. విశాఖపట్నానికి చెందిన నవ దంపతులు చంద్రమౌళి, అభిలలతో కలిసి మరో ముగ్గురు అన్నవరం దేవస్థానంలో వ్రతం చేసుకుని విశాఖపట్నం వెళుతుండగా గురువారం గోకులపాడు జంక్షన్‌లో కారు బోల్తాపడింది. అయితే కారు మూడు పల్టీలు కొట్టినా కారులో ఉన్న అయిదుగురికి చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు వద్దకు అడ్డురోడ్డు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన చేరుకుని కారులో ఉన్నవారిని స్థానికులు సహాయంతో బయటకు తీశారు. ఈ సంఘటనపై ఎస్.రాయవరం పోలీసులకు ఫిర్యాదు రాలేదని చెప్పారు.


