ఇంటికి 5 నిమిషాల దూరంలో... గాల్లో కలిసిన స్నేహితురాళ్ల ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

ఇంటికి 5 నిమిషాల దూరంలో... గాల్లో కలిసిన స్నేహితురాళ్ల ప్రాణాలు

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

● పెళ్లికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన ● మరో నలుగురికి స్వల్ప గాయాలు

అగనంపూడి: వివాహ వేడుకకు ఆనందంగా వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు... ఇంటికి చేరుకోవడానికి మరో ఐదు నిమిషాల ప్రయాణమే మిగిలుండగా అనంతలోకాలకు చేరారు. కారు అదుపు తప్పి వంతెనను ఢీకొని కాలువలో పడిన ఘనటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. వివరాలు..

గాజువాక కణితి రోడ్డులోని శివాజీనగర్‌(అజీమాబాద్‌)కు చెందిన లఖనాపురం మంగ (48), ఆమె స్నేహితురాలు బన్నా కుసుమ తమ కుటుంబ సభ్యులు, మరో 15 మందితో ఐదు కార్లలో అనకాపల్లిలో బుధవారం జరిగిన వివాహానికి హాజరయ్యారు. వేడుక అనంతరం గురువారం తెల్లవారుజామున తిరుగుముఖం పట్టారు. ఉదయం సుమారు 5.30 గంటలకు టోల్‌గేట్‌ సమీపంలోని ఉప్పర కాలనీ వంతెన వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వంతెనను బలంగా ఢీకొని కాలువలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన మంగ(48) అక్కడికక్కడే మృతిచెందగా, కుసుమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ప్రమాదంలో కారు డ్రైవర్‌, కుసుమ కుమారుడు బాలమురళీకృష్ణ, సొల్లేటి విజయలక్ష్మి, బాలమురళీకృష్ణ మేనకోడలు తాన్వి పట్నాయక్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి ఏప్లస్‌, కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

ఒక్క రోజు వ్యవధిలోనే..

బుధవారం ఉదయం వడ్లపూడి వంతెన వద్ద ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు సోదరులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరుసటి రోజు అదే సమయంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement