యలమంచిలి రూరల్: యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్రం విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న కె. వెంకన్న తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీ నుంచి డాక్టరేట్ పొందారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. క్లిష్టమైన, అత్యంత ఉపయుక్తమైన భార లోహాలైన నియోబియం, హాఫ్నియం,జెర్కోనియంలతో పాటు అల్యూమినియం, టిన్ లోహాల మిశ్రమాలపై నిర్మాణాత్మక, అయస్కాంత, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానిక్, ధర్మో ఎలక్ట్రిక్, మాగ్నెటోకాలోరిక్ లక్షణాల ప్రథమ సూత్రాలపై పరిశోధన చేయడం అభినందించదగ్గ విషయంగా పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. నిట్ అధ్యాపకుడు డాక్టర్ జె.కృష్ణమూర్తి పర్యవేక్షణలో డాక్టరేట్ పట్టా పొందడం గొప్ప విషయమని పలువురు ప్రశంసించారు. పరిశోధన పూర్తి చేసిన అధ్యాపకుడు వెంకన్న మాట్లాడుతూ భవిష్యత్తులో తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ సామర్థ్యం కలిగిన మెమొరీ పరికరాలు, అయస్కాంత సెన్సార్లు, కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి తన పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ భౌతికశాస్త్రం విభాగాధిపతి జగ్గారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
అభినందించిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు


