తుమ్మపాల: జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్దేశిత గడువులో లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న వినతులను సంబంధిత శాఖలకు వెంటనే పంపించి, పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు నెలల క్రితం పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంకా కొందరికి అందలేదని అర్జీలు వస్తున్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ–కేవైసీ ద్వారా ఆధార్, డాక్యుమెంట్ నంబర్‌లను ఽధ్రువీకరించి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ మాట్లాడుతూ, ఈ–కేవైసీ, మన మిత్ర, క్రాప్ బుకింగ్, ఓడీఎఫ్ గ్రామాలు, డీఆర్‌డీఏ కార్యక్రమాలు, స్వచ్ఛాంధ్ర తదితర ప్రభుత్వ కార్య క్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. ‘సర్’ ఫారాల సేకరణ, ఇంటింటి సర్వే పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. గృహ నిర్మాణా లు, పీఎం సూర్యఘర్ యోజన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాలి
ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆప్షన్లు నమోదు చేయాలని, ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులను ఖాళీలు ఉన్న జిల్లాలకు కేటాయించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాల కేటాయింపు ముసాయిదా మార్గదర్శకాలు, పలు అంశాలపై వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా నుంచి ఏర్పడిన అన్ని కొత్త జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్థానిక జిల్లా ఆధారంగా కాకుండా కేడర్ సీనియారిటీ ప్రకారం కేటాయింపులు జరుగుతాయని చెప్పారు. ప్రతి ఉద్యోగి ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేసి, తమ సీనియారిటీ, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్ అవకాశాలను దృష్టిలోఉంచుకుని ఆప్షన్లునమోదుచేసుకోవాలన్నారు.
పారదర్శకంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ
జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఐసీడీఎస్ సీడీపీవోలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 30 అంగన్‌వాడీ వర్కర్ల పోస్టులు, 206 హెల్పర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలను ఈ నెల 21న అనకాపల్లి డివిజన్‌లోను, 23న నర్సీపట్నం, అడ్డురోడ్డు డివిజన్లలో నిర్వహించాలని ఎంపిక కమిటీ సభ్యులను ఆదేశించారు.
సమర్థంగా జల్ జీవన్ మిషన్
జిల్లాలో జల్ జీవన్ మిషన్–2.0 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. జిల్లా జల,పారిశుధ్య కమిటీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ కార్యనిర్వాహక ఇంజినీరు అనిల్ కుమార్, జిల్లా పంచా యతీ అధికారి సందీప్, డీడబ్ల్యూఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల దేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


