దేవరాపల్లి/కె.కోటపాడు/అనకాపల్లి టౌన్/పాయకరావుపేట : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ చూపారు. కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన విద్యార్థిని బంటు ధాత్రిక 5వర్యాంక్ సాధించింది. తండ్రి పెంటారావు మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి మాధవి గృహిణి. దేవరాపల్లికి చెందిన కొల్లి ప్రియాంక 79వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ప్రియాంక తండ్రి కొల్లి సింహాద్రి మాజీ సైనికుడు కాగా తల్లి రత్నం గృహిణి. ప్రియాంక పదవ తరగతి వరకు విశాఖలోని కేంద్రీయ విద్యాలయం–2లో, ఇంటర్మీడియెట్ రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. నీట్ ప్రవేశ పరీక్ష రాశానని, మంచి ర్యాంక్ వస్తుందన్న నమ్మకం ఉందని ప్రియాంక తెలిపింది. ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు సాధించి వైద్యురాలిగా స్థిరపడటమే తన ధ్యేయమని చెప్పింది. ప్రియాంక ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
●కె.కోటపాడు మండలం వారాడ గ్రామానికి చెందిన లెక్కల లావణ్య 164వ ర్యాంక్ సాధించింది. లావణ్య తల్లిదండ్రులు నారాయణమూర్తి, లక్ష్మిలు విశాఖపట్నంలో పనిచేసుకుంటూ తమకు గల ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తున్నారు. తండ్రి నారాయణమూర్తి పూర్ణామార్కెట్‌లో కళాసీ కాగా, తల్లి వరలక్ష్మి గృహిణి. పదవ తరగతి వరకూ తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్మీడియెట్ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఇంటర్మీడియెట్‌లో 957 మార్కులను సాధించింది. ఇటీవల నీట్ పరీక్షకు కూడా లావణ్య హాజరైంది. మంచి ర్యాంక్ వస్తుందనే ఆశాభావంతో కుమార్తె లావణ్య ఉన్నట్లు తండ్రి నారాయణమూర్తి తెలిపారు.
●అనకాపల్లి పట్టణానికి చెందిన సర్వసిద్ధి వెంకట్ తరుణ్ సాయి 258 ర్యాంకు సాధించాడు. ఇతని తండ్రి సర్వసిద్ధి వరహాలు అనకాపల్లి పట్టణంలోని భీమునిగుమ్మం హైస్కూల్‌లో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
●శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థి జె.మోనిష్ కుమార్ 55వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో బైపీసీ విద్యార్థిని ఎ.నవ్య 710 వ ర్యాంకు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్. భానుమూర్తి తెలిపారు. క్లాస్ రూమ్ ప్రోగ్రాంతో పాటుగా వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా తమ విద్యార్థులు ఈ విజయాలను సాధిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్. విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు.
రోజుకు 12 గంటలు శ్రమించా
యలమంచిలి రూరల్: జేఈఈ అడ్వాన్స్‌డ్ –2026 ఫలితాల్లో ఆలిండియా 151 వ ర్యాంకు సాధించిన మర్రపు సుధీర్ కుమార్ బుధవారం విడుదలైన ఏపీఈఏపీసెట్ 2026 ఫలితాల్లో 64వ ర్యాంకు కై వసం చేసుకుని సత్తా చాటాడు.యలమంచిలి కోర్టు పేటలో నివాసం ఉంటున్న మర్రపు సుధీర్ కుమార్ తండ్రి చంద్రశేఖర్ నక్కపల్లి హెట్రోడ్రగ్స్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తుండగా తల్లి అనూరాధ గృహిణి.విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వీరి కుటుంబం 16 సంవత్సరాల క్రితం యలమంచిలి వచ్చి, స్థిరపడింది. రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమించి చదివి ఐఐటీ అడ్వాన్స్‌డ్‌తో పాటు ఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించినట్టు సుధీర్ ‘సాక్షి’కి తెలిపాడు.ఇప్పటికే ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించినట్టు తెలిపాడు. ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఏదైనా స్టార్టప్ నెలకొల్పాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు.తమ కుమారుడు ప్రవేశ పరీక్షల్లో చూపిన ప్రతిభ పట్ల తల్లిదండ్రులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.


