మహారాణిపేట(విశాఖ): సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28, 29 తేదీల్లో జరగనుంది. లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ బుధవారం కలెక్టరేట్‌లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితర అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గిరి ప్రదక్షిణ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమవుతుంది. మొత్తం 32 కిలోమీటర్ల మార్గంలో తాగునీరు, బయో టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రా లు, వైద్యశిబిరాలు, అంబులెన్సులు, మొబైల్ మెడికల్ యూనిట్లు, విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక విశ్రాంతి కేంద్రం, మొత్తం 50 నీటి ట్యాంకు లు అందుబాటులో ఉంచాలని సూచించారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు 50 క్యూలైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే అదనపు కౌంటర్లు సిద్ధం చేయా లని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, హనుమంతువాక ప్రాంతంలో జాతీయ రహదారిని భక్తులు దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అంబులెన్సుల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, మార్గమంతా వైద్య బృందాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, అగ్నిమాపక సేవలు, రహదారుల మరమ్మతులు తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించా రు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గిరి ప్రదక్షిణ మార్గమంతా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి, అన్ని కెమెరాలు సమర్థంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ జూలై 29న భక్తులకు అన్ని దర్శనాలు ఉచితంగా కల్పించనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, లతామాధురి, ఆర్డీవో సంగీత్ మాధుర్, దేవదాయ, జీవీఎంసీ, ఆర్టీసీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


