బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో అట్టహాసంగా సాగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, లోకేష్, సంధ్యారాణి హాజరయ్యారు. ఎంతో కష్టపడి చదివి పట్టాలు అందుకుంటున్న సమయంలో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లలు ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, ఏకంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు, పతకాలు అందుకోవడం చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. విజయనగరం కేంద్రంగా 2019లో అప్పటి ౖవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కాగా, వందలాది మంది గిరిజన, తదితర విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించే దిశగా వర్సిటీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2020 నుంచి 2025–26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ పట్టాలను ప్రదానం చేశారు.
వేడుకలా పట్టాల అందజేత..
ఈ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల ఆధ్వర్యంలో ఎనిమిది పీజీ, ఐదు డిగ్రీ కోర్సుల్లో విద్యనభ్యసించిన వారికి పట్టాలు అందించారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ విభాగం నుంచి అత్యధికంగా 200 మంది విద్యార్థులు పట్టాలందుకోగా.. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషనల్ సైన్సెస్ నుంచి 82 మంది, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి 91 మంది విద్యార్థులు తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసి పట్టాలు స్వీకరించారు. ఈ స్నాతకోత్సవంలో విద్యార్థినులు తమ సత్తా చాటారు. వర్సిటీలో విశిష్ట ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ 13 మందిలో ఏకంగా 11 మంది విద్యార్థినులే కావడం విశేషం.


