మాడుగుల రూరల్ : పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. మండలంలో తాటిపర్తి పంచాయతీ శివారు కాశీపురం ఎంపీపీఎస్ పాఠశాలను మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిషు, లెక్కల పుస్తకాలు ఆయన విద్యార్థుల పక్కన కూర్చొని చదివించారు. విద్యార్థుల విద్యాప్రమాణాలు పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, తదితర వాటి గురించి పాఠశాల హెచ్‌ఎం దయాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏడో తరగతి చదువుతూ మధ్యలో చదువు మానేసిన ఇ.కళ్యాణం రిషి వసంత అనే విద్యార్థిని ఆయన సమ్మతితో తిరిగి 7వ తరగతిలో ఎం.కోడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో చేర్పించారు. అనంతరం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అంగన్‌వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో చిన్నారులతో చిన్న చిన్న వాక్యాలు చదివించారు. ఆయన వెంట స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.


