తుమ్మపాల: పోలీసు శాఖలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలందించి, క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణతో ఆదర్శంగా నిలిచిన ఏడుగురు అధికారులకు జిల్లా పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ ఎల్.మోహనరావు పదవీ విరమణ పొందిన అధికారులను, వారి కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి ఎంతో ఒత్తిడితో కూడుకున్నదన్నారు. అటువంటి బాధ్యతాయుతమైన రంగంలో 35 నుంచి 40 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు ఎస్‌ఐ వి.వెంకటరమణ (కమ్యూనికేషన్), ఏఎస్‌ఐ పి.వెంకటేశ్వరరావు (నాతవరం పి.ఎస్), ఏఎస్‌ఐ పి.కేశవరావు (వి.మాడుగుల పి.ఎస్), ఏఎస్‌ఐ బి.అప్పారావు (కొత్తకోట పి.ఎస్), హెచ్‌సీ పి.కొండల రావు (నర్సీపట్నం టౌన్ పి.ఎస్), హెచ్‌సీ ఆర్.రాఘవులు, హెచ్‌సీ హెచ్.టి.నాయుడు (జిల్లా ఆర్మడ్ రిజర్వ్)లను సన్మానించి విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.రవికుమార్, ఏఓ. సిహెచ్.తిలక్ బాబు, ఇన్‌స్పెక్టర్లు బాల సూర్యారావు, లక్ష్మి, వెంకటచిట్టి, రామకృష్ణారావు, మన్మథరావు, రమణమూర్తి, సేనం రమేష్, పిల్లా రమేష్, సీనియర్ అసిస్టెంట్ అప్పలరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


