కశింకోట: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి దూసుకురావడంతో వృద్ధ మహిళ దుర్మరణం చెందింది. కశింకోట ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ప్రకారం... జగ్గయ్యపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కశింకోట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి హైవే పక్కనున్న కాలువ మీదుగా కొంత దూరం ముందుకు దూసుకొచ్చింది. అక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రవేశంలో మదుం, సోలార్ లైట్ స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఆ సమయంలో మట్టి పాత్రలు తీసుకొని విశాఖ వెళ్లడానికి మదుంపై కూర్చొని వాహనం కోసం నిరీక్షిస్తున్న స్థానిక కుమ్మరి వీధికి చెందిన దేవరపు చంద్ర (61) తీవ్రంగా గాయపడింది. ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఉన్న త వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ మేరకు కోడలు జగదీశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి చంద్ర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి తీర్చుకున్నారు. వారిని వేరే బస్సుల్లో గమ్యాలకు చేర్చారు. ప్రమాదానికి గురైన బస్సు ముందు భాగం, అద్దం దెబ్బతిన్నాయి. హైవే పక్కన మురుగు కాలువ, మదుం గోడ దెబ్బతిన్నాయి. సోలార్ లైట్ స్తంభం ధ్వంసమై నేలకొరిగింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.


