స్కూటీని ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొట్టిన లారీ

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

మర్రిబంద వద్ద ప్రమాదం

యలమంచిలి రూరల్‌ : విధి నిర్వహణలో భాగంగా జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్తున్న పంచాయతీ కార్యదర్శిని రోడ్డు ప్రమాదం కబళించింది. పంచాయతీ కార్యదర్శి నడుపుతున్న స్కూటీని యలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలివి. పాయకరావుపేటకు చెందిన కిల్లాడ బాబూరావు(52) నక్కపల్లి మండలం ఎన్‌.నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అనకాపల్లిలో ఉన్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి స్కూటీపై వెళ్తుండగా యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మర్రిబంద వద్ద వెనుక నుంచి వస్తున్న ఏపీ39యూజెడ్‌ నంబరు గల లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదంలో రోడ్డుపై పడిపోవడంతో తల, శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదస్థలంలోనే పంచాయతీ కార్యదర్శి బాబూరావు ప్రాణాలు విడిచారు. అతని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఊహించని విధంగా పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సమాచారం తెలియడంతో యలమంచిలి మార్చురీ వద్దకు పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు చేరుకుని బాబూరావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement