కశింకోట : ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి తద్వారా పండే ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులను అందించి ప్రజాహితానికి రైతులు దోహదపడాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. మండలంలోని బయ్యవరం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవనాల శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఎద్దుల నాగలితోపాటు ట్రాక్టర్‌పై దుక్కి దున్నారు. వరి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రైతులు పంట భూములు, ప్రజలకు హాని కలిగించే రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. యూరియా అవసరానికి మించి వినియోగించరాదన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని వాడాలన్నారు. ప్రతి పొలానికి నీరు అనే నినాదంతో నీటిపారుదల శాఖ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, నీటి వృధాను తగ్గించి, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
త్వరలోనే జిల్లాకు పోలవరం నీరు : ఎమ్మెల్యే రామకృష్ణ
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నీటిని జిల్లాకు త్వరలోనే అందించనున్నారన్నారు. పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులు పూర్తి అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 8 వేల ఎకరాలకు సాగునీరు లభించనుందన్నారు. రూ.7.5 కోట్లతో సాగునీటి కాలువలల్లో పూడికలు తీయించారని, దీనివల్ల పంట భూములకు సమృద్దిగా నీరు అందుతుందన్నారు. యూరియా కొరత లేదని, పాసు పుస్తకం ఉన్న పంట భూములకు యూరియా ఎరువు అందిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ వరి విత్తనాల పంపిణీకి నిబంధనలు సరళతరం చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా వరి విత్తనాలు అందజేస్తామన్నారు.
సాగు యంత్రాల ప్రదర్శన
ఈ సందర్భంగా రైతులకు రాయితీపై అందజేసే పవర్ వీడర్లను, డ్రోన్‌ను ప్రదర్శించారు. వివిధ స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యాన వన, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో అందజేస్తున్న యంత్రాలు, పరికరాలను ప్రదర్శించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో డబ్ల్యూడీసీపీ–పీఎంకేఎస్‌వై 2.0 పథకం కింద బయ్యవరం చేరి చెరువును రూ.50 లక్షలతో అభివృద్ధి చేయడానికి కలెక్టర్ విజయకృష్ణన్ శంకుస్థాపన చేశారు. గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త ముకుందరావు, ఎంపీడీవో చంద్రశేఖరరావు, మండల వ్యవసాయ అధికారి స్వప్న, కూటమి నాయకులు గొంతిన శ్రీనివాసరావు, కాయల మురళీధర్, వేగి గోపీకృష్ణ, దాసరి బాబు పాల్గొన్నారు.


