అర్జీలను సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

● కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ● పీజీఆర్‌ఎస్‌ –131,రెవెన్యూ క్లినిక్‌–147 వినతులు

తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌ అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఆమెతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఇన్‌చార్జి డీఆర్వో వై.శ్రీనివాస్‌ దరఖాస్తుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, ఏడీ సర్వే, ఇరిగేషన్‌, జీవీఎంసీ, ఏడీ అగ్రికల్చర్‌, మైనింగ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, లేబర్‌ ఆఫీస్‌, ఫిషరీస్‌, ఏపీఎస్‌ఆర్టీసీ, డ్వామా, తాగునీరు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను కేవలం సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం కాదని, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులను తిరస్కరించాల్సి వస్తే, దానికి సరైన కారణాలను తెలియజేస్తూ ఫిర్యాదుదారునికి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌–131, రెవెన్యూ క్లినిక్‌– 147 వినతులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుడికి స్థలం కేటాయించాలని వినతి

సబ్బవరం మండలం గుల్లేపల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి వంద చదరపు గజాల స్థలంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మించామని కమిటీ వారు , భక్తులు తెలిపారు. గుడి నిర్మించిన స్థలం సర్వే నంబరు 103లో ఉందని, దాన్ని అధికారికంగా గుర్తించి హిందువుల మనోభావాలను కాపాడుతూ న్యాయం చేయాలని కోరారు. గ్రామంలో ప్రజలందరికి ఉపయోగపడే ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామివారి గుడి ఒక్కటి మాత్రమే ఉందని, తమ అభ్యర్థనను మన్నించి ఆ స్థలం అధికారికంగా కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.

అనకాపల్లి జోన్‌లో కార్మికుల నియామకాలు చేయాలి

జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా 250 మందిని కొత్తగా నియమించాలని, ప్రస్తుతం ఉన్న వారిపైనే పనిభారం తీవ్రంగా ఉన్నందున ఆర్సి నంబరు 436/2025/ ప్రకారం రూ. 147 డైలీ వేజ్‌ ప్రాతిపదికన పారిశుధ్య కార్మికులుగా నియమించాలంటూ కార్మికులు కలెక్టర్‌కు వినతి అందించారు. జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 27 మందిని సచివాలయానికి ఒకరు చొప్పున నియమించి మిగతా 120 మంది. పోస్టులు ఇంకా నియమించలేదన్నారు. వెంటనే మిగిలిన పోస్టులను పారిశుధ్య కార్మికులుగా పనిచేసి రిటైర్మెంట్‌, డెత్‌, సిక్‌ కార్మికుల వారసులను నియమించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement