గుట్టుచప్పుడు కాకుండా పాత్రుడు చెరువు రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా పాత్రుడు చెరువు రీ సర్వే

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

● కూటమి నేతను నిర్బంధించిన గ్రామస్తులు ● కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారంటూ అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం ● అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్‌

తుమ్మపాల : అనకాపల్లి మండలం రేబాక పంచాయతీ కాపుశెట్టివానిపాలెం సర్వే నెం.243లో పదేళ్లగా వివాదంలో ఉన్న పాత్రుని చెరువుకు రెవెన్యూ అధికారులు సోమవారం చేపట్టిన రీసర్వే తీవ్ర వివాదానికి తెరలేపింది. 13.70 ఎకరాల చెరువు కబ్జాదారులకు గ్రామస్తులకు మధ్య జరిగిన మాటల యుద్ధం కాస్త తోపులాటగా మారి కూటమి పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న పోల్నాటి అప్పారావును మూడు గంటల పాటు గ్రామస్తులు నిర్బంధించారు. అతనితో పాటు చెరువు రికార్డులు తారుమారు చేసి కబ్జాకు యత్నిస్తున్న మరో టీడీపీ సీనియర్‌ నేత మామిడి చిన్నారావు, మండలంలో బడా వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్‌ రావాలంటూ, చెరువుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పదేళ్లుగా వివాదంలో ఉన్న చెరువుపై కబ్జాదారులకు సమాచారమిచ్చి రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామస్తుల అభ్యంతరంతో వివాదంలో కొనసాగుతున్న చెరువు రీసర్వేను గ్రామస్తులకు తెలియకుండా సర్వే చేపట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల క్రితం చెరువు రీసర్వేకు సిద్ధమైనప్పటికీ గ్రామపెద్దలు అభ్యంతరం తెలపడంతో సర్వే బృందం రీసర్వేను నిలిపివేసింది. మరలా ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాదారుల సమక్షంలో రీసర్వే చేపట్టడంలో అధికారుల తీరు అనుమానాలకు తావిచ్చింది. రీసర్వేను అడ్డుకున్న గ్రామస్తులు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. పోలీసుల రాకతో అక్కడ నుంచి కబ్జాదారులు జారుకున్నారు. దీంతో గ్రామస్తులంతా అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసి కలెక్టరేట్‌ గేటు వద్ద ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా నీటి సంఘం చైర్మన్‌ మంత్రి కాసులునాయుడు, వైఎస్సార్‌సీపీ నేత మంత్రి సత్తిబాబు, వైస్‌సర్పంచ్‌ కాపుశెట్టి రామకృష్ణ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గనిరెడ్డి రాజు మాట్లాడుతూ కాపుశెట్టివానిపాలెంలో పాత్రుని చెరువుగా ఉన్న 13.70 ఎకరాల చెరువు రెవెన్యూ రికార్డును 2016లో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మామిడి చిన్నారావు అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క బినామీల పేర్లతో మార్చేసారని, చెరువు విక్రయించేసి రూ.రెండు కోట్లు వరకు దోచేసిన ఉదంతంపై అప్పట్లో ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి బినామీల పేర్లను తొలగించకుండా డిస్ప్యూట్‌గా మాత్రమే చేర్చి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. చెరువుపై జరిగిన దస్తావేజులను రద్దు చేసుకుంటామంటూ ఇద్దరు టీడీపీ నేతలతో పాటు వ్యాపారవేత్త గొట్టిపాటి సుధాకర్‌ కూడా కాపుశెట్టివానిపాలెం రామాలయంలో హమీలిచ్చి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చెరువుకు రీసర్వే చేపట్టడం దారుణమన్నారు. పాత్రుని చెరువు జలాధారంగా 150 ఎకరాల ఆయకట్టు భూమి ఉందని, కబ్జాదారులపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ, కూటమి పార్టీ నేతలు గొంతిన శివశంకర్‌, కాపుశెట్టి అర్జునరావు, కోసిరెడ్డి మహేష్‌, కరణం మాణిక్యాలరావు, బొద్దపు కోటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement