మునగపాక: మండలంలోని తోటాడలో సోమవారం రాత్రి సురభి నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాతి గాంచిన భానోదయ సురభి నాట్యమండలి వారిచే ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజున శ్రీకృష్ణలీలలు పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. నాటకంలోని నటీనటులు అద్భుతంగా నటించారు. నాటకంలోని సన్నివేశాలతోపాటు సెట్టింగ్‌లు ఆహూతులను అలరించాయి. ఈ పోటీలను జ్యోతి వెలిగించి వక్తలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్ మాట్లాడుతూ కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంతో అనుభవం కలిగిన కళాకారులు ఉన్నారని తెలిపారు. వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సురభి నాటకాలకు దేశంలోనే తగిన గుర్తింపు ఉందన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించడంలో మునగపాక మండలం ఎప్పుడూ ముందుంటుందన్నారు. గౌరీ నాట్యమండలి ఆధ్వర్యంలో తోటాడలో సురభి నాటక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు.


