● కలెక్టర్ విజయ కృష్ణన్
మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల పురోగతి, బాధితులకు అందించిన ఆర్థిక సహాయం, పునరావాస చర్యలు, కేసుల దర్యాప్తు, న్యాయపరమైన చర్యలపై సమగ్రంగా విచారణ చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం అమలు తీరును సమీక్షించేందుకు జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అందించే అన్ని రకాల సహాయాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడంతోపాటు, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఇన్‌చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు, ఆర్డీవో షేక్ అయేషా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


