‘సర్’ కీలక షెడ్యూల్ ఇదే
జూన్ 15 నుంచి జులై 14 : బీఎల్‌ఓల ఇంటింటి సర్వే, సమాచార సేకరణ. జులై 21: ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా విడుదల. జులై 21 నుంచి ఆగస్టు 20: ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ, కొత్త ఓటర్ల దరఖాస్తులు. సెప్టెంబర్ 18 లోపు: అభ్యంతరాలు, ఫిర్యాదుల పూర్తిస్థాయి పరిష్కారం. సెప్టెంబర్ 22: తుది (ఫైనల్) ఓటర్ల జాబితా ప్రకటన.
సాక్షి, అనకాపల్లి : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం అనేక రకాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు తమ అనుకూల ఓట్లు పోకుండా, ప్రత్యర్థుల ఓట్లను తుడిచేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్య ఓటర్లలో ఈ ప్రక్రియపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలకు ‘ఫారం–2’ నింపడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అవగాహన లోపం వల్ల వేలాది మంది అర్హులైన సామాన్యులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత పాత జాబితాతో అనుసంధానం కాని వారికి ఓటర్ నమోదు అధికారి (ఈఆర్‌ఓ) నోటీసులు జారీ చేస్తారు. అయితే, ముసాయిదా జాబితాలో పేరున్న వ్యక్తిపై విచారణ జరపకుండా, వారికి న్యాయ సమ్మతమైన అవకాశం ఇవ్వకుండా పేరును తొలగించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇంటింటికీ బీఎల్‌ఓలు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సవరణ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈనెల 15 నుంచి బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యూమరేషన్ (గణన) ప్రక్రియ ప్రారంభించారు. బీఎల్‌ఓలు ప్రతి ఓటరుకు ‘ఇన్ డూప్లికేట్’ (రెండు ప్రతులు) ఓటర్ ఫారాలను అందిస్తారు. ఫారం ఎలా నింపాలో వివరించి, పూర్తి చేసిన తర్వాత ఒక ఫారాన్ని వారు తీసుకుని, రెండో దాన్ని ఓటరుకు రశీదుగా ఇస్తారు.బీఎల్‌ఓలు వచ్చినప్పుడు ఇళ్లకు తాళాలు ఉంటే (డోర్‌లాక్) ఫారాలను అక్కడే ఉంచి వెళ్తారు. గరిష్టంగా మూడు సార్లు సదరు ఇంటిని సందర్శిస్తారు. ఓటర్లు ఈ ఫారాలను ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని, నింపి, తిరిగి అప్‌లోడ్ చేసి బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది.
మ్యాపింగ్ కాకపోతే ‘ఓటు’ గల్లంతే!
జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సరిపోదు.. ఓటర్లంతా విధిగా ‘మ్యాపింగ్’ పూర్తి చేసుకోవాలి. జిల్లాలో మొత్తం 13,02,389 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 89.05 శాతం (11,59,842 మంది) మ్యాపింగ్ పూర్తయింది. ఇంకా 10.95 శాతం మంది (1,42,547 మంది) మ్యాపింగ్ కావాల్సి ఉంది. వీరంతా తక్షణమే సంబంధిత బీఎల్‌ఓను సంప్రదించి మ్యాపింగ్ చేయించుకోవడంతో పాటు ఫారం పూర్తి చేసి ఇవ్వాలి. లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తుంది. దీనికోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
తొలగింపుల వేట.. 10 శాతం ఓట్లు మాయం?
ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకే ‘సర్’ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. చనిపోయిన వారు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నవారు (డబుల్ ఓట్లు), శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ క్రమంలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రస్తుత జాబితా నుంచి కనీసం 10 శాతం వరకు అర్హులైన, సజీవంగా ఉన్న ఓటర్ల పేర్లు కూడా మాయమయ్యే ముప్పు పొంచి ఉందని క్షేత్రస్థాయి పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలి రోజు మందకొడిగా...
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం తొలి రోజు మందకొడిగా సాగింది. బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌వో)లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు సోమవారం 20 వేలకు పైగా ఫారాలను జిల్లాలో పంపిణీ చేశారు. ఈ ఫారాలను ఓటర్లకు ఇచ్చి కొద్ది రోజుల తర్వాత ఈ ఫారాలను తిరిగి బీఎల్‌వోలు సేకరిస్తారు. జిల్లాలో 13,02,389 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 1,529 పోలింగ్ కేంద్రాలకు 1529 బీఎల్‌ఓను నియమించారు. బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్‌లు కొన్ని ఏరియాల్లో పర్యటించారు. ప్రతి పార్టీ నుంచి ఒక వ్యక్తిని పోలింగ్ స్టేషన్‌లో పర్యటించి ఫారాలను భర్తీ చేయడానికి ఓటరుకు సహకారం అందించే అవకాశం ఉంది.
ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రారంభం
సామాన్యుడికి ఫారం–2 శిరోభారం!
జులై 14 వరకు బీఎల్‌ఓల ఇంటింటి సర్వే..
మ్యాపింగ్ కాకపోతే ఓటు గల్లంతే
జిల్లాలో 89.05 శాతం మ్యాంపింగ్ పూర్తి
జిల్లాలో ఇంకా 1.42 లక్షల మంది పెండింగ్
జులై 21న ముసాయిదా.. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల


