ఇ–ఫార్మసీలపై
ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ పిలుపు నేడు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ఉమ్మడి జిల్లాలో 3,400 మెడికల్ దుకాణాలు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇ–ఫార్మసీలు కృత్రిమ మేథస్సు(ఏఐ)తో నకిలీ ప్రిస్క్రిప్షన్ల సృష్టి నియంత్రణ లేని మందులతో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు తనిఖీలు లేవు.. జవాబుదారీతనం శూన్యం ప్రజల ఆరోగ్యం, రోగుల భద్రతపై ప్రభావమంటున్న అసోసియేషన్ ప్రతినిధులు
సాక్షి, అనకాపల్లి : అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం (ఏఐఓసీడీ) పిలుపుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఔషధ వ్యాపారులు ఉద్యమబాట పడుతున్నారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలు, ఈ–ఫార్మసీల ధోరణిని నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ప్రభావంతో సాధారణ మందుల కొనుగోళ్లు ఒక రోజు పాటు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రం తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బంద్‌లో మందులు దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గోనున్నారు.
మూడు జిల్లాల్లోనూ నిరసన ప్రభావం
ఈ నిరసన కాక ఉమ్మడి విశాఖ జిల్లాల్లో స్పష్టంగా కనిపించనుంది. విశాఖపట్నం జిల్లాలో 1600, అనకాపల్లి జిల్లాలో 1500, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300 చొప్పున మొత్తం 3400 మందుల దుకాణాల సిబ్బంది, కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ బంద్‌లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతున్నారు.
కార్పొరేట్ శక్తుల అండతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల స్థానిక, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న మెడికల్ షాపులు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని, ఈ అసమాన పోటీని తట్టుకోలేక చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చిందని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ ప్రిస్క్రిప్షన్ల ముప్పు
ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల కేవలం వ్యాపారులకే కాకుండా ప్రజారోగ్యానికి కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండానే విచ్చలవిడిగా డ్రగ్స్ ఆన్‌లైన్ ద్వారా చేతులు మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వాడుకుని నకిలీ ప్రిస్క్రిప్షన్‌లను సృష్టిస్తున్నారని, తనిఖీలు లేకపోవడంతో నాసిరకం, నకిలీ మందులు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నియంత్రణ లేని యాంటీబయోటిక్స్ వాడకం వల్ల రోగులలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి ప్రాణాలకే ముప్పు వస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల ఉల్లంఘన..
సాధారణంగా హోల్‌సేలర్ మార్జిన్ 8 నుంచి 10 శాతం, రిటైల్ ఫార్మసిస్ట్ మార్జిన్ 16 నుండి 20 శాతం వరకు ఉంటే, ఈ–ఫార్మసీలు ఏకంగా 20 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తూ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. నేషనల్ ప్రైస్ అథారిటీ నిబంధనలను పక్కనబెట్టి సాగుతున్న ఈ ధరల వ్యత్యాసాన్ని అరికట్టాలని కెమిస్టులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన తాత్కాలిక సడలింపులను ఆసరాగా చేసుకుని ఇప్పుడు వ్యాపారాలు చేయడం సరికాదని, ఆ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ బంద్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
శాంతియుత నిరసనకు పిలుపు
ఈ బంద్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజలతో గానీ, అధికారులతో గానీ ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని, సోషల్ మీడియా ద్వారా పుకార్లను వ్యాప్తి చేయవద్దని అసోసియేషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే అంబులెన్సులు, అత్యవసర వైద్య సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా శాంతియుతంగా నిరసన చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
ఔషధ విక్రయశాలలు
ఎమర్జెన్సీ రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ఏఐఓసీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ కారణంగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లా, అల్లూరి జిల్లాల్లో ఎమర్జెన్సీ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రి అనుబంధ మెడికల్ షాపులు తెరిచే ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా మెడ్‌ప్లస్, అపోలో ఫార్మసీలను ప్రధాన సెంటర్లలో తెరిచే ఉంచాలని కోరడం జరిగింది.
– రజిత, ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్
ఈ–ఫార్మసీని నియంత్రించాలి
రోగులకు ఇబ్బంది లేకుండా ప్రధాన సెంటర్‌లో ఒకటి రెండు మందుల దుకాణాలు తెరిచేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆసుపత్రుల అనుబంధ మెడికల్ షాపులో ఉన్న సిబ్బంది కూడా బంద్‌లో పాల్గొంటారు. రోగులకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా మా నిరసనను తెలియజేస్తున్నాం. ఈ–ఫార్మసీ, ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను పూర్తిగా నియంత్రించాలనేదే మా డిమాండ్. నకిలీ మందులకు చెక్ పెడుతూ ప్రజా రోగ్యాన్ని కాపాడాలనేదే మా నిరసన.
– నొదిరిపాటి సూర్య ప్రకాష్ గుప్తా, అనకాపల్లి జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు


