మా బతుకులెలా..? | - | Sakshi
Sakshi News home page

మా బతుకులెలా..?

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

● ప్రధాని పిలుపుతో ఆందోళనలో స్వర్ణకారులు ● ఉమ్మడి విశాఖ జిల్లాలో బంద్‌ ● మూతపడ్డ బంగారు దుకాణాలు

బంగారం కొనొద్దంటే

డాబాగార్డెన్స్‌ (విశాఖ): ‘దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు స్వర్ణకారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ‘ప్రజలు బంగారం కొనొద్దంటే మా ఉపాధి మాటేమిటి?.. మా కుటుంబాలను ఎవరు పోషిస్తారు?’ అంటూ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా స్వర్ణకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 30 సంఘాలకు చెందిన స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు బంద్‌లో పాల్గొని నిరసనలు చేపట్టారు.

వేలాది కుటుంబాల్లో సంక్షోభం

స్వర్ణకార సంఘాల అంచనా ప్రకారం విశాఖ నగర పరిధిలోనే 30 నుంచి 35 వేల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వృత్తి అవకాశాలు తగ్గడంతో ఇప్పటికే పలువురు ఇతర రంగాల్లోకి వెళ్లిపోయారని, ఇంకా మిగిలిన వారు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారని సంఘాల నేతలు పేర్కొన్నారు. విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గురజాపు రవి మాట్లాడుతూ పెరిగిన ధరలు, కార్పొరేట్‌ షోరూమ్‌ల పోటీ, పన్నుల భారం మధ్య ప్రధాని వ్యాఖ్యలు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా’ మారాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్వర్ణకార సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పక్కి కొండబాబు మాట్లాడుతూ ఇప్పటికే ఆభరణాల విక్రయాలు పడిపోవడంతో వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం స్వర్ణకార సంఘాల ప్రతినిధులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర స్వర్ణకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గోడి నరసింహాచారికి వినతి పత్రం అందజేశారు. స్వర్ణకార కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు, ఆర్థిక చేయూత, బ్యాంకు రుణాల నిబంధనల సడలింపు, అప్రైజర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, రుణాలపై వడ్డీ భారం తగ్గింపు వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.

నర్సీపట్నం, మాడుగులలో నిరసనలు

నర్సీపట్నం/మాడుగుల : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం స్వర్ణకారుల అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి, ఆర్డీవో వి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం దుకాణాలను బంద్‌చేశారు. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏడాదిపాటు బంగారం కొనుగోలు చేయవద్దని పిలుపునివ్వడంతో తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలన్నారు. ప్రధాని పిలుపునకు నిరసనగా మంగళవారం మాడుగులలో స్వర్ణకారులు తమ షాపులను మూసి వేసి బంద్‌ పాటించారు.

అనంతరం స్థానిక తహసీల్దారు కె. రమాదేవికి వినతిపత్రం అందజేశారు. స్థానిక మోద కామాక్షి స్వర్ణకారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వర్ణకారులకు ఎటువంటి రాయితీలు, రుణాలు కల్పించలేదని తెలిపారు. అంతకుముందుకు సతకంపట్టు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement