స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌కు విరాళాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

స్వర్ణాంధ్ర పీ–4 ఫౌండేషన్‌కు విరాళాలివ్వండి

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

● పారిశ్రామికవేత్తలతో సదస్సులో కలెక్టర్‌

తుమ్మపాల : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ‘స్వర్ణాంధ్ర పీ.4 ఫౌండేషన్‌’కు జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు తమ వంతు మద్దతుగా విరాళాలు అందించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగిన ‘స్వర్ణాంధ్ర విజన్‌– 2047’ సదస్సులో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌పటేల్‌, స్వర్ణాంధ్ర పి.4 ఫౌండేషన్‌’ స్టేట్‌ డైరెక్టర్‌ సాంబశివరావులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1.34 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, పరిశ్రమలు ఏదైనా ఒక గ్రామాన్ని, మండలాన్ని దత్తత తీసుకుని, అక్కడ మౌలిక వసతుల కల్పన మరియు ప్రజల ఎమోషనల్‌, మెంటల్‌ స్పేస్‌కు అండగా నిలుస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు. ఒకవేళ వ్యక్తిగతంగా సమయాన్ని కేటాయించలేకపోయినా, ఈ పథకం కింద అనుమతించబడిన క్రౌడ్‌ ఫండింగ్‌, క్రౌడ్‌ సోర్సింగ్‌ ద్వారా పరిశ్రమలు, వ్యక్తులు తమ భాగస్వామ్యాన్ని అందించవచ్చన్నారు. పరిశ్రమలు నేరుగా స్వర్ణాంధ్ర పి.4 ఫౌండేషనన్‌కు నిధులను విరాళంగా ఇవ్వవచ్చని, రాష్ట్ర స్థాయిలో ఉండే ఈ ఫౌండేషన్‌న్‌కు ఏ జిల్లాలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎక్కడ నిధులు అవసరమో భౌగోళికంగా, ఆర్థికంగా స్పష్టమైన అవగాహన ఉంటుందన్నారు. పరిశ్రమలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కమిటీ సమావేశాల్లో ప్రభుత్వం యొక్క ఈ అవసరాలను, ‘స్వర్ణాంధ్ర పి.4 ఫౌండేషన్‌’ కాన్సెప్ట్‌ను చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర పి.4 ఫౌండేషన్‌‘ స్టేట్‌ డైరెక్టర్‌ సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు వీలుగా ప్రభుత్వం రూపొందించిన ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ విజన్‌’ సాధనలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం పది సూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పి–4) విధానం ద్వారా పేదరికాన్ని ఎలా నిర్మూలించవచ్చో వివరిస్తూ, ఈ పరివర్తనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఓ రామారావు, ఇండస్ట్రీస్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కె.పి ప్రసాద్‌, జిల్లా పరిధిలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement