అనకాపల్లి : జిల్లాలో భూ సమస్యలు పరిష్కారానికి మన రిజిస్ట్రేషన్ –మన బాధ్యత కార్యక్రమాన్ని మంగళవారం, శుక్రవారం జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ కె.మన్మధరావు అన్నారు. మండలంలో జాతీయ రహదారి కొత్తూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మంగళవారం మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీజీఆర్‌ఎస్‌కు ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని, వాటిని తగ్గించేందుకు రాష్ట్రంలో మొదటి సారిగా మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత కార్యక్రమాన్ని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి సమస్యలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వంశపర్యాపరంగా వచ్చిన వ్యవసాయ భూమిని యాజమాని మృతిచెందినట్టయితే మృతుడి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ నంబర్ సర్టిఫికెట్, సెల్ఫ్ డిక్లరేషన్‌తో ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్‌ను చేయడం జరుగుతుందని, ప్రభుత్వానికి కొంత నగదు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద 2004 తరువాత డాక్యుమెంట్ రైటర్లకు ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం భూమిలో నివసిస్తున్న వ్యక్తులకు అక్కడ గృహానికి సంబంధించిన ఇంటిపన్ను, కరెంట్ బిల్లు, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వానికి నగదు చెల్లించినట్టయితే గృహ యజమానికి సొంత గృహంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.


