తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కారమవుతాయని గంపెడాశతో వస్తున్న అర్జీదారులు కలెక్టరేట్‌లో తీవ్ర అసౌకర్యానికి గురై అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. దీనికితోడు మండుటెండలో గంటల తరబడి క్యూలో నిలబడి, నీడ లేక చెట్ల కిందే అర్జీలు రాసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండుటెండలో వస్తే, ఇక్కడ గుక్కెడు తాగునీరు లేక విలవిల్లాడుతున్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన పీజీఆర్‌ఎస్ తమ సహనాన్ని పరీక్షించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు గంటల కొద్దీ క్యూలో నిల్చున్నారు. వీరి కోసం ఏర్పాటు చేసిన తాగునీటి డబ్బాలో చుక్క నీరు లేకపోవడం గమనార్హం. దాంతో మంచినీటి కోసం వెతలు పడ్డారు. రెండు వారాల క్రితం పెట్టిన చలివేంద్రం జాడ కూడా లేకపోవడంతో తీవ్ర ఎండలో అర్జీదారులు చెమటలు కక్కుకున్నారు.
278 అర్జీల నమోదు
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరిస్తామన్న భరోసా కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతోపాటు డీఆర్వో సత్యనారాయణ, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం కారణంగానే రీఓపెన్ అవుతున్నాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలను తెలియజేయాలన్నారు. ఈ వారం మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా అఽఽధికారులు పాల్గొన్నారు.


