అనుకోని ప్రమాదం.. మంచానికే పరిమితం! | - | Sakshi
Sakshi News home page

అనుకోని ప్రమాదం.. మంచానికే పరిమితం!

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 12:40 AM

రాచపల్లిలో ఆటో డ్రైవర్‌ శ్రీను దీన పరిస్థితి రోడ్డు ప్రమాదంలో మెడకు గాయం పనిచేయని ఒకవైపు కాలు, చేయి పేదరికంతో ఇబ్బందిగా మారిన కుటుంబ పోషణ చాపలు అల్లుకుని జీవనం సాగించే

మాకవరపాలెం: అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ ఆటో డ్రైవర్‌ను మంచానికే పరిమితం చేసింది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో కుటుంబ పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన పట్నాల శ్రీను(33) ఆటో నడుపుకొంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2024 మార్చి 3వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుకొని ఇంటికి వస్తుండగా రాచపల్లి గ్రామం దగ్గరలో మలుపు వద్ద కారును తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో సుమారు 5 గంటలపాటు మెడపైన ఉండిపోయింది. దీంతో మెడ భాగం దెబ్బతినగా ఆపరేషన్‌ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఒక వైపు భాగం మొత్తం చేయి, కాలు, శరీరంలో చలనం లేకపోవడంతో శ్రీను రెండేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. శ్రీనుకు భార్య జయ, కుమార్తెలు నవ్యశ్రీ(8), రోహిత(7), కుమారుడు పార్థు(5) ఉన్నారు. మంచంపైనే ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని వాపోతున్నాడు. కనీసం పెన్షన్‌ అయినా ఇప్పించాలని వేడుకుంటున్నాడు. చాపలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులే తమకు ఆధారంగా ఉన్నారని శ్రీను తెలిపాడు. ఆపరేషన్‌కు రూ.24 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారని, అంత నగదు లేక మంచానికే పరిమితం అయ్యాయని వాపోయాడు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నాడు.

తల్లిదండ్రులపైనే ఆధారం

Advertisement
 
Advertisement
Advertisement