రావికమతం: మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఎండ దెబ్బకు తాళలేక అస్వస్థతకు గురవుతున్నారు. ఉపాధి పనులు ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, తాగునీరు ఉండటం లేదు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 9 గంటల నుంచి ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. వడగాల్పులకు ఇంటిలోంచి బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీస వసతులు లేక ఉపాధి కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా మండలంలోని వమ్మవరం పంచాయతీలో అడవిరాజుల బాబు కొండపై నీటి నిల్వ కోసం కందకాల పనులు చేస్తున్నారు. ఇక్కడ గ్రామానికి చెఽందిన చేబులు గంగునాయుడు (50) సోమవారం ఉపాధి పనులు చేస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని తక్షణమే ఫీల్డ్ అస్టిసెంట్ నీటిపల్లి రామకృష్ణ, తోటి కూలీలు కొత్తకోట పీహెచ్‌సీకి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి పనుల ప్రదేశంలో ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.


