అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ రాకతోనే గోవాడ సుగర ఫ్యాక్టరీ మనుగడకు ముప్పు వాటిల్లిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 1955లో నిర్మించిన గోవాడ సుగర్ ఫ్యాక్టరీ, 1962–1963 సీజన్ నుంచి నిరాటంకంగా నడపగా, 2025–26 సీజన్‌లో కూటమి ప్రభుత్వం క్రషింగ్ నిలిపి వేసిందన్నారు. గత సీజన్(2024–25)కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ. 29 కోట్లు, కార్మికులకు 3 నెలల జీతాలు, 70 మంది రిటైర్డ్ కార్మికుల గ్రాట్యుటీలు కలిపి సుమారు రూ. 7 కోట్లు మేర బకాయిలను నేటికీ చెల్లించలేదన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో 24 వేల మంది సభ్య రైతులు, 1000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. మరో 2 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫ్యాక్టరీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు, బడా పారిశ్రామిక వేత్తలకు వందలాది ఎకరాలు భూములు, రూ.వేల కోట్ల రూపాయాలను రాయితీలను ధారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీకి రూ.100 కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని రూ. 300 కోట్లతో ఆధునికీకరిస్తామని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం రైతులను, కార్మికులను మోసం చేయడం కాదా? అని అగ్రహం వ్యక్తం చేశారు. 2025–26 సీజన్‌లో కనీసం మహాజన సభ సైతం ప్రభుత్వం నిర్వహించలేక లేకపోయిందని ఎద్దేవా చేశారు. సుగర్ ఫ్యాక్టరీని పీపీపీ విధానంలో ప్రైవేటుకు ఇచ్చే విధానాన్ని విరమించుకొని, ప్రభుత్వమే ఫ్యాక్టరీని ఆధునికీకరించి పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెరకు రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించి ఆదుకోవాలని లేకుంటే రైతులు, కార్మికుల తరపున పోరాటం చేసేందుకు ఉన్నామని వెంకన్న స్పష్టం చేశారు.


