● ముగ్గురు సిబ్బందికి స్వల్పగాయాలు
అనకాపల్లి: స్థానిక రైల్వే స్టేషన్‌ల్లో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న షెడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై ఫుట్‌పాత్ బ్రిడ్జికు సమీపంలో నూతనంగా చిన్నపాటి షెడ్ నిర్మిస్తున్న సమయంలో ఆరో పిల్లర్‌పై గడ్డర్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పడిపోయింది. అక్కడే కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు కోటేశ్వరరావు, వాసు, సునీల్‌కు స్వల్పగాయాలయ్యాయి. కోటేశ్వరరావుకు కాలిపై పెద్దగాయం తగలడంతో హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. స్టేషన్ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే షెడ్ కూలిపోయిందని ప్రయాణికులు తెలిపారు. షెడ్ నిర్మిస్తున్న సమయంలో కాంట్రాక్టర్, రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఆ సయంలో రైలు రాకపోవడం, ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న షెడ్ కూలిపోవడంతో మూడో నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న హెచ్‌డీ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడం వల్ల పెద్దప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లను ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై నుంచి పంపించడంతో, కొన్ని రైళ్లు ఆలస్యంగా వెళ్లడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే హెచ్‌డీ విద్యుత్ ఉద్యోగుల సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన మరమ్మతులు చేశారు. ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా సమాధానాన్ని దాటవేశారు.


