ప్రభుత్వ భూముల పరిరక్షణకు
● సీఎంఓ కార్యాలయం, పీజీఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ
● రెవెన్యూ అధికారుల సమీక్షలో
కలెక్టర్ విజయకృష్ణన్
తుమ్మపాల: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఽశౌర్యమాన్ పటేల్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భూముల తాలూక తాజా పరిస్థితులను తెలుపుతూ నివేదికలు సమర్పించాలని, సంక్షిష్ట పరిస్థితులకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ, రీ సర్వే, వెబ్ ల్యాండింగ్ పోర్టింగ్, తదితర అంశాలపై నిర్వహించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావించారు. మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నెం. 30 ప్రకారం అందరికీ ఇల్లు కార్యక్రమంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు స్వయంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. 22(ఏ) పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చౌక ధరల దుకాణాలు, పెట్రోలు బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలకు మహిళలు పిల్లలు వచ్చినట్లయితే ముందుగా వారికి సరుకులు పంపిణీ చేయాలని, మంచి నీరు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ ఏజెన్సీలలో ముందస్తు బుకింగ్స్ లేకుండా చూడాలని, గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ ద్వారా మాత్రమే అందజేయాలని, గ్యాస్ గోడౌన్ వద్ద ఎటువంటి డెలివరీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గనులు క్వారీలపై అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఫైర్ క్రాకర్ యూనిట్లకు సంబంధించిన తనిఖీ నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవోలు వి.వి. రమణ, షేక్ ఆయేషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


