వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు కొట్టివేత

Apr 2 2026 7:53 AM | Updated on Apr 2 2026 7:53 AM

చోడవరం : వైఎస్సార్‌సీపీ నాయకులకు కోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును చోడవరం కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 12 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టిన కేసు నిరాధారమైనదంటూ నిర్దోషులుగా పేర్కొంటూ వారిపై పెట్టిన కేసును కోర్టు కొట్టేసింది. వివరాల్లోకి వెళితే... 2018లో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఒక యువకుడు కోడి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన చోడవరం వైఎస్సార్‌సీపీ నాయకులు తమ అధినేతపై జరిగిన హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ శాంతియుతంగా చోడవరం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, చోడవరం జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్‌, చోడవరం ఉపసర్పంచ్‌ పుల్లేటి వెంకట్రావు,బిసీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంపలి ఆనంద్‌, జిల్లా ప్రతినిధి జ్యోతుల రమేష్‌, సోషల్‌ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఓరుగంటి నెహ్రూ, జిల్లా ప్రతినిధి వడ్డాది నర్సింహమూర్తి, మండల బీసీసెల్‌ అధ్యక్షుడు సూరిశెట్టి నాగదుర్గగోవింద, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు శరగడం నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షురాలు అల్లాడ భవానీతో సహా 12 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి 9సంవత్సరాలు పాటు వాయిదాలకు కోర్టుకు తిరిగిన ఆ పార్టీ నాయకులకు కోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్‌సీపీ నాయకుల తరపున ఆ పార్టీ లీగల్‌ అడ్వయిజర్‌ కాండ్రేగుల డేవిడ్‌ కోర్టులో వాదనలు వినిపించారు. అప్పటి తహసీల్దార్‌, ఇద్దరు ఎస్‌ఐలు, పలువురు కానిస్టేబుళ్లు ఈ విచారణలో కోర్టుకు హాజరయ్యారు. చోడవరం జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి స్వర్ణ ఈ కేసును విచారణ చేసి తుది తీర్పు చెప్పారు. నిందితులపై మోపబడిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా పరిగణిస్తూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారని నిందితుల తరపు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్‌ చెప్పారు. ఈ సందర్భంగా వారంతా డెవిడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement