2025–26లో ప్రగతి పథంలో దూసుకెళ్లిన రైల్వే డివిజన్
ఈ ఏడాది రూ.11,598 కోట్ల ఆదాయం ఆర్జన
సరకు రవాణాలో 85.1 మిలియన్ టన్నులతో రికార్డు.. 17.25 శాతం వృద్ధి
డివిజన్ పరిధిలో 3.34 కోట్ల ప్రయాణికుల రాకపోకలు..
రూ.881 కోట్ల ఆదాయం
వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బోహ్రా వెల్లడి
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్‌ఎం ఇంకా ఏం చెప్పారంటే..
ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు
వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం.
శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు
వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్‌లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్‌లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్‌గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు
వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్‌లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం.
మౌలిక వసతుల విస్తరణ
రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్‌ఎం స్పష్టం చేశారు.


