ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ.1.20 కోట్లు
● రద్దీకి తగ్గట్టు ప్రత్యేక బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు
అల్లిపురం(విశాఖ): సంక్రాంతి పండగ సందర్భంగా విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు వారం రోజుల్లో రూ. 1.20 కోట్ల ఆదాయం లభించిందని రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విశాఖ ద్వారకా బస్ స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలను పర్యవేక్షించారు. పండగ ముగియడంతో ప్రయాణికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాలకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. శనివారం 100 ప్రత్యేక బస్సులు నడపగా, ఆదివారం ఉదయం నుంచే 150కి పైగా బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, పార్వతీపురం వంటి ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని వివరించారు. విజయవాడకు 40, రాజమండ్రికి 40, కాకినాడకు 20 బస్సులతో పాటు హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సూపర్‌వైజర్లు 24 గంటల పాటు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం పద్మావతి, ఏటీఎంలు గంగాధర్, సుధాకర్, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్లు మోహన్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.


