అప్పలరాజు అరెస్టు దుర్మార్గం
ఎస్.రాయవరం: రైతు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం పీడీ యాక్టు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జి.అప్పారెడ్డి అన్నారు. మండలంలోని ధర్మవరం అగ్రహారంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను సీపీఎం జిల్లా కార్యవర్గ నాయకులు ఆదివారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న అప్పలరాజుపై పీడీయాక్టు నమోదు చేయడం అన్యాయమన్నారు. అప్పలరాజును విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కార్యదర్శి ఆర్పి రెడ్డి ,మిడ్డేమీల్స్ కార్మికుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ అప్పలరాజు వెంటనే విడుదల చేయకుంటే అన్ని జిల్లాల్లో ఉద్యమాలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయకార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


